Begin typing your search above and press return to search.

ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా వెంకయ్య?

By:  Tupaki Desk   |   12 Sep 2016 4:33 AM GMT
ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా వెంకయ్య?
X
‘‘ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఏపీలో బీజేపీని వెంకయ్య చంపేశారు’’ అంటూ కాకినాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్య సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. రాజకీయ అనుభవం లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు తాను స్పందించనని చెబుతూనే.. వారాంతంలో తన వాదనను వినిపించేందుకు పెద్ద ఎత్తున సమయాన్ని ఖర్చు చేసిన వెంకయ్య వైఖరిని చూస్తేనే పవన్ మాటల ప్రభావం ఆయనపై ఎంత ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

విలేకరులతో పలుమార్లు మాట్లాడిన వెంకయ్య.. కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వటం ద్వారా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై సానుకూలత వ్యక్తమయ్యేలా పెద్ద ఎత్తున ప్రయత్నించారు. ఇందుకోసం తన వ్యక్తిగత పలుకుబడిని సైతం వినియోగించినట్లుగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా రాదంటే రాదని ఖరాఖండిగా చెప్పేస్తున్న వెంకయ్య.. ఏపీకి కేంద్రం ఎంత చేసిందో తెలుసా? అంటూ చెవులూరించే మాటల్ని చాలానే చెప్పేస్తున్నారు. వెంకయ్య మాటలు విన్న వారు ఎవరైనా.. హోదా విషయంలో ఏపీ విపక్షాలు..ఉద్యమ నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారా? అనుకునేలా ఉండటం గమనార్హం. తాము పవర్ లోకి వచ్చిన తర్వాత ఏపీకి ఎంతో చేశామని చెప్పే వెంకయ్య మాటలన్నీ ఓపిగ్గా విన్న తర్వాత ఆయన ప్రస్తావించని కొన్ని అంశాల్ని సూటిగా అడగాలనిపించక మానదు.

చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవటమో.. లేదంటే వాటిని బైపాస్ చేసేలా మాట్లాడుతున్న వెంకయ్యకు ఈ ప్రశ్నలు...

= హోదా వల్ల ఏమీ లేదని ఇప్పుడు తీరుబడిగా చెబుతున్న వెంకయ్య.. విభజన సమయంలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించినట్లు?

= విభజన సమయంలో ఉన్న ఒత్తిడి.. హడావుడి కారణంగా అడిగారనే అనుకుందాం. ఎన్నికల మేనిఫేస్టోలో ఎందుకు పెట్టినట్లు? అప్పుడు కావాల్సినంత టైం ఉంది కదా?

= ఒకవేళ ఎన్నికల మేనిఫేస్టోలో కూడా అవగాహన లేకనే పెట్టారని అనుకుందాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత తెలిసిన వెంటనే ఎందుకు చెప్పలేదు? తప్పు జరిగి ఉంటే.. తమ వల్ల తప్పు జరిగిందని చెంపలేసుకొని.. అందుకు పరిహారంగా ఇప్పుడు చెబుతున్న ‘అంతకు మించి’ అన్న మాటను ఎందుకు చెప్పనట్లు?

= ప్రత్యేక హోదా అన్నది 2017 వరకే అంటూ తరచూ ప్రచారం చేస్తున్న కేంద్రం.. కొండ ప్రాంతాల రాష్ట్రాలకు ఈ నిబంధన వర్తించదన్న విషయాన్ని ఎందుకు బలంగా ప్రచారం చేయటం లేదు?

= స్వల్ప వ్యవధిలో భారీగా విద్యాసంస్థల్ని తీసుకొచ్చినట్లు గొప్పలు చెబుతున్న వెంకయ్య.. ఆయా విద్యా సంస్థలకు అవసరమైన సొంత భవనాల ఏర్పాటు విషయానికి వచ్చేసరికి.. ‘‘పిండి కొద్ది రొట్టె’’ అంటూ సామెత చెప్పి తప్పించుకోవటం ఏమిటి?

= పోలవరం మీద కాంగ్రెస్ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్న వెంకయ్య.. వారు తప్పు చేసినందుకే ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మరి.. రెండేళ్ల మూడు నెలల్లో పోలవరం విషయంలో మోడీ సర్కారు చేసిందేమిటి?

= రాజధాని ఏర్పాటుకు ఇప్పటికి స్పష్టమైన ప్యాకేజీని ఎందుకు ప్రకటించలేదు?

= రైల్వే జోన్ పై నిర్ణయం కోసం ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి?

= ఆంధ్రప్రదేశ్ ఎంపీని కాకున్నా ఏపీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు గొప్పలు చెబుతున్న వెంకయ్య.. పుట్టిన ప్రాంతం కోసం చేస్తున్నది కష్టంగా ఉంటే చేయకుండా ఆగిపోవచ్చుగా? కష్టపడటం ఎందుకు? బాధ పడటం ఎందుకు?

= విభజన చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని చెబుతూనే.. విభజన సమయంలో ఏడు రోజుల పాటు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లుగా వెంకయ్యే చెప్పుకున్నారు. మరి.. అన్ని తప్పులు ఉన్నప్పుడు.. విభజన చట్టానికి తమ మద్దతు ఉండదని తేల్చి చెబితే.. మరింత బాగా చట్టం రూపొందించేవారుగా? ఆ తప్పు బీజేపీ ఎందుకు చేసినట్లు?

= ఏదైనా ఆర్థిక సాయం గురించి అడిగితే చాలు.. భారతప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సమస్యల గురించి చెబుతారు. సమస్యలు ఉన్నప్పుడు సాయం చేయటమే గొప్ప. అంతా బాగున్నప్పుడు సాయం చేయటం గొప్పేం కాదన్న విషయాన్ని వెంకయ్య ఎందుకు మర్చిపోతున్నారు?

= ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించి.. నమ్మకద్రోహం చేసిన వారికి.. పార్లమెంటులో ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకున్న వారికి విమర్శించే హక్కు లేదని చెప్పే వెంకయ్య.. ఏపీ విభజనకు తాము సైతం సంపూర్ణ సాయం అందించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఏకపక్షంగా విభజిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎందుకు నోరు కట్టేసుకుంది? విభజనలో భాగస్వామ్యులైన బీజేపీకి ఎవరో నమ్మకద్రోహం చేశారంటూ విమర్శించే హక్కు ఉందా?