Begin typing your search above and press return to search.

వెంక‌య్య ప‌రిస్థితి ఏంటి? కొన‌సాగింపు ఉంటుందా? ఉండ‌దా? పొలిటిక‌ల్ గుస‌గుస‌

By:  Tupaki Desk   |   22 Jun 2022 4:05 AM GMT
వెంక‌య్య ప‌రిస్థితి ఏంటి?  కొన‌సాగింపు ఉంటుందా?  ఉండ‌దా?  పొలిటిక‌ల్ గుస‌గుస‌
X
బ‌ల‌మైన గ‌ళం. మూడు భాష‌ల‌పై ప‌ట్టు. అంత‌కు మించి.. స‌మ‌యానుకూల రాజ‌కీయం చేయ‌డంలో దిట్ట‌. ఆయ‌నే ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు. అయితే.. ఆయ‌న భ‌విష్య‌త్తుపై ఇప్పుడు రాజ‌కీయ దుమారం రేగింది. ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోడీ గెలిచేందుకు.. ఆయ‌న వాదాన్ని ద‌క్షిణాదిన‌ ప్ర‌చారం చేసేందుకు 2014లో కీల‌క నాయ‌కుడిగా ప‌నిచేసిన వెంకయ్య‌కు త‌ర్వాత కాలంలో మోడీ కేంద్ర మంత్రిగా, త‌ర్వాత ఉప‌రాష్ట్ర‌ప‌తిగా అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే మోడీ.. వెంక‌య్య‌ను ప‌క్క‌న పెట్టేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిత్వంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా వెంక‌య్య పేరు బీజేపీ నేత‌ల మ‌ధ్య జోరుగా వినిపించింది. ఈ ప‌ద‌విని ఆయ‌న కూడా ఆశించారు. అందుకే కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని రాష్ట్రాలు చుట్టేశారు.

అవ‌కాశం వ‌చ్చినప్పుడే కాదు.. అవ‌కాశం క‌ల్పించుకుని మ‌రీ.. మోడీ స‌ర్కారుకు ఉప‌రాష్ట్ర‌ప‌తి హోదాలో కితాబునిచ్చారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు స‌హా.. ఇత‌ర అంశాల‌పై రాజ్య‌స‌భ‌లో మోడీ వాణికే ఆయ‌న పెద్ద‌పీట వేశార‌నే ప్ర‌తిప‌క్షాల వాద‌న‌ను కూడా లెక్క‌చేయ‌కుండా.. `మోడీ మ‌నిషి`గా పేరు తెచ్చుకునేందుకు ప్ర‌యాస ప‌డ్డారు.

అయితే.. ఇప్పుడు అదే మోడీ.. వెంక‌య్య‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఆయ‌న‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం వెనుక‌.. `వాజ్‌పేయి మ‌నిషి`గా ఉన్న ముద్రే కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వెంక‌య్య రాజ‌కీయ భ‌విత‌వ్యం ఏంటి? క‌నీసం మ‌రో ప‌దేళ్ల పాటు ఆయ‌న యాక్టివ్‌గా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు.. కొన్నాళ్ల కింద‌ట ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఆయ‌న‌కు ఆ ఛాన్స్ లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ద్రౌప‌దీ ముర్మును ఎంపిక చేసింది. ఇక‌, మిగిలింది ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి.

ఈ పోస్టుకు కూడా ముస్లింమైనారిటీ అభ్య‌ర్ధిని ఎంపిక చేయాల‌నే దిశ‌గా `మోడీ టీం` స‌మాలోచ‌న‌లు చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్న ద‌రిమిలా.. ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కూడా అయిపోతే.. వెంక‌య్య ఇక‌, ఇంటికే ప‌రిమితం కావాల్సి ఉంటుంద‌ని.. నైతికంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు పోస్టుల్లో ప‌నిచేసిన వారు.. రాజ‌కీయంగా ఎక్క‌డా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదని.. కాబ‌ట్టి వెంక‌య్య ఇక‌, రిటైర్మెంట్‌కు రెడీ కావాల్సిందేన‌ని చెబుతున్నారు.

ఇదే జ‌రిగితే.. వాజ్‌పేయి హ‌యాం నుంచి బీజేపీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్లిన నాయ‌కుడిగా ఉన్న వెంక‌య్య ఇక‌, ఇంటికే ప‌రిమితం కావాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. వెంక‌య్య ప‌రిస్థితి ఇక‌, ఇక్క‌డితో స‌మాప్త‌మా.. లేక ముందుకు సాగుతుందా? అనేది చూడాలి.