Begin typing your search above and press return to search.

నాయుడు గారు...న్యాయం మ‌రిచారా?

By:  Tupaki Desk   |   27 Aug 2015 10:47 AM GMT
నాయుడు గారు...న్యాయం మ‌రిచారా?
X
స్మార్ట్ సిటీలు (ఆకర్షణీయ నగరాల‌) జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అట్ట‌హాసంగా విడుద‌ల చేశారు. దేశంలో వంద స్మార్ట్ సిటీలను ఎంపిక చేశామ‌ని వాటితో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా లెక్క‌లు వివ‌రించారు. అత్యధికంగా యూపీ నుంచి 14 నగరాలు, తమిళనాడు నుంచి 12, మహారాష్ట్ర నుంచి 10, మధ్యప్రదేశ్‌ నుంచి 7, గుజరాత్‌, కర్ణాటకల నుంచి 6 చొప్పున నగరాలను ఎంపిక చేశామని, బీహార్‌ రాష్ట్రంలో మూడు నగరాలు ఎంపిక చేశామని వెంకయ్యనాయుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ లో విశాఖ - కాకినాడ - తిరుపతి - తెలంగాణలో హైదరాబాద్ - వరంగల్‌ ను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

స్మార్ట్‌ సిటీలో తగినంత నీటి సరఫరా, నిరంతరాయం విద్యుత్ సరఫరా ఖాయమని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తామని వెంకయ్య తెలిపారు. పేదలకు గృహవసతి అందుబాటులో ఉంచుతామని...ఐటీ కనెక్టివిటీ ఉంటుందన్నారు. సుపరిపాలన అందించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ గవర్నెన్స్‌ కు ప్రాధాన్యమిస్తామని, అన్ని రంగాల్లో పౌరుల భాగస్వామ్యానికి ప్రాధాన్యమిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. రాబోయే ఆరేళ్ళలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి 3 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. ప్రతి ఏడాది ఒక్కో స్మార్ట్ సిటీకి 100 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు వివ‌రించారు. మ‌రి ఇవ‌న్నీ తెలుగు రాష్ర్టాల‌కు అవ‌స‌రం లేవా?

ముఖ్యంగా విభ‌జ‌న వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీ సంగ‌తి ఏంటి? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పొరుగునే ఉన్న త‌మిళ‌నాడుకు 12 న‌గ‌రాలు, మ‌హారాష్ర్ట‌కు 10..అసలు సామాన్యులు కూడా నివాసించేందుకు ఇష్ట‌ప‌డ‌ని బీహార్‌కు 3 స్మార్ట్ సిటీలు ఇచ్చారు. అంత‌కంటే అన్నిర‌కాలుగా అర్హ‌మైన‌, అనువైన‌...అన్నింటికీ మించి ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న ఏపీని న‌ట్ట‌న‌డిరోడ్డున ప‌డేశారు. రైల్వే చార్జీల లెక్క‌లు చూసినా, విమాన ప్ర‌యాణికుల వివ‌రాలు తేల్చినా... అభివృద్ధి లెక్క‌లు తీసినా ఏపీలోని విజ‌య‌వాడ‌ - గుంటూరు - నెల్లూరు వంటి న‌గ‌రాలు ఎన్నో స్మార్ట్ సిటీల అర్హ‌త సాధించేందుకు స‌రిప‌డా అర్హ‌తలున్నావాటిని తుంగ‌లో తొక్కారు.

స్మార్ట్ సిటీల వ్య‌వ‌హారంలో ఏ విధంగా చూసినా... కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల‌ను నిందించ‌కుండా ఉండ‌లేని పరిస్థితి. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ ద్వారానే స్మార్ట్ న‌గ‌రాల ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతున్నాఏపీపై వెంక‌య్య ఏమాత్రం ఆపేక్ష క‌న‌బ‌ర్చ‌లేదు. ప్ర‌త్యేక అభిమానం చూప‌క‌పోయినా ప‌ర‌వాలేదు కానీ...అన్ని అర్హ‌త‌లు ఉన్న న‌గ‌రాల‌ను సైతం ప‌ట్టించుకోకుండా వ‌దిలేశార‌నే భావ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏపీలోని న‌గ‌రాల కంటే ఏ ర‌కంగా చూసినా త‌క్కువ స్థాయి ప్ర‌మాణాలున్న ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్, బీహార్‌ లోని న‌గ‌రాలు అధికంగా ఎలా అర్హ‌త సాధించాయి. త్వ‌ర‌లో ఎన్నిక‌లు ఉన్న బీహార్‌ పై చూపిన ప్రేమ న‌రేంద్ర‌మోడీకి, వెంక‌య్య‌నాయుడికి ఏపీపై ఎందుకు లేదు? వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడు పోరులో గెలిచేందుకు ఇపుడు 12స్మార్ట్ సిటీలు ప్ర‌క‌టించిన వారికి ఏపీలో ఎన్నిక‌లు అయిపోయాయి కాబ‌ట్టే...ఏపీని నిండా వ‌దిలేశారా?

ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఘోరంగా మోసం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం... ప్ర‌త్యేక రైల్వే జోన్ విష‌యంలోనూ పక్కా హామీ ఇవ‌డం లేదు. దీనికి తోడు ప్యాకేజీ విష‌యంలో ఎంత ఇస్తారో ఏమీ చెప్ప‌ని ప‌రిస్థితి. ఇవ్వ‌న్నీ ఇలా ఉంటే...మెట్రో రైల్ విష‌యంలోనూ మొండి చేయి చూపించారు. అయిన‌ప్ప‌టికీ దాన్ని కొన‌సాగిస్తున్నాం...అన్యాయం ఇంకా చేస్తాం అన్న‌ట్లుగా స్మార్ట్ సిటీల విష‌యంలోనూ ఈ విధంగా చేయ‌డం...అది కూడా వెంక‌య్య‌నాయుడు చూస్తున్న పోర్ట్‌ ఫోలియో కావ‌డం ఆస‌క్తిక‌రం.

కొద్దిరోజుల క్రితం జ‌రిగిన స‌మావేశంలో వెంక‌య్య‌నాయుడు చేసిన వ్యాఖ్య‌లు తాజాగా జ‌రిగిన నిర్ణ‌యానికి మూల‌మా అనే సందేహాలు కూడా ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సులో ఉన్నాయి. తాడేప‌ల్లిగూడెం నిట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా కావాల‌ని పలువురు నిన‌దిస్తుంటే..."నేను మీరు ఓట్లు వేస్తే ఏపీ నుంచి ఎన్నిక కాలేదు. భ‌విష్య‌త్తులో కూడా కాను. నాతో మీకు అవ‌స‌రం త‌ప్ప‌...మీతో నాకు అవ‌స‌రం లేదు"అంటూ వెంక‌య్య‌నాయుడు లైట్ తీస్కో విధానంలో మాట్లాడారు. మ‌రి ఏ విధంగా ఆయ‌న త‌మిళ‌నాడుకు న్యాయం చేయ‌గ‌లిగారు? ఏ విష‌యాల్లో ఏపీ కంటే త‌మిళ‌నాడు దాదాపు 4 రెట్ల అర్హ‌త‌ల‌ను క‌లిగి ఉంది అనేది ఎవ‌రికైనా అర్థం అవుతుంది. ఏలిన వారికి న‌చ్చినట్లు నిర్ణ‌యాలు అన్న‌ట్లు ఎన్నిక‌లున్న రాష్ర్టాల‌కు ఒక నిర్ణ‌యం..వారికోసం ఇత‌రుల‌కు అన్యాయం చేయ‌డ‌మే ప్ర‌ధాన‌మంత్రి చెప్తున్న టీం ఇండియా విధాన‌మా?

మ‌రోవైపు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రి ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని నేరుగా చెప్పేసినా..చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు. కేంద్రంలో త‌ను చెప్పిన‌ట్లే ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని ప‌దే ప‌దే చెప్పుకునే బాబు....క‌నీసం త‌న రాష్ర్టానికి కూడా ఎందుకు మేలు చేసుకోలేకపోతున్నారు? చ‌ంద్ర‌బాబు ప్ర‌భావం త‌గ్గిందా లేక‌పోతే కావాల‌నే బాబు చెప్పుకున్నారా? ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చుతారా లేదా అని కూడా చంద్ర‌బాబు 4 కోట్ల ఆంధ్రుల ప‌క్షాన అడ‌గ‌లేరా?

ఇవ‌న్నీ ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభిమానుల్లో క‌లుగుతున్న సందేహాలు, వెల్లువెత్తుతున్న ప్ర‌శ్న‌లు. ఆయా ప‌రిస్థితుల‌ను సమీక్షించుకొని బీజేపీలో కీల‌క నేత‌గా ఉన్న వెంక‌య్య‌నాయుడు....ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబునాయుడు త‌గు విధంగా త‌ప్ప‌క‌ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.