Begin typing your search above and press return to search.

అర్థం చేసుకోరూ..రిటైర్మెంటు అంటూ లేనట్టేనండీ!!

By:  Tupaki Desk   |   30 July 2017 4:37 AM GMT
అర్థం చేసుకోరూ..రిటైర్మెంటు అంటూ లేనట్టేనండీ!!
X
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా తిరుగుతూ... విచ్చలవిడిగా సన్మానాలు, సత్కారాలు చేయించేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ప్రతిచోటా ఒకటే రికార్డెడ్ ప్రసంగాన్ని ఆయన సభికులకు నివేదించుకుంటున్నారు. కాకపోతే.. మీడియా వారు సరిగ్గా గమనించారో లేదో గానీ.. ఆయన ప్రసంగాల కవరేజీలో ఓ చిన్న పొరబాటు దొర్లిపోయింది. దానివల్ల వెంకయ్యనాయుడు కు డ్యామేజీ జరిగిపోయే ప్రమాదం ఉన్నదని.. పలువురు ఆయనకు సన్నిహితులు పాపం... ఆందోళన చెందుతున్నారు.

ఇంతకూ ఆ విషయం ఏంటంటే.. తాను 2019 ఎన్నికల తర్వాత, అంటే మోడీని తిరిగి ప్రధానమంత్రిని చేసిన తర్వాత.. 2020లో రాజకీయాలనుంచి రిటైర్ అయి, పూర్తిగా ప్రజాసేవా కార్యక్రమాల్లోకి వెళ్లిపోవాలని అనుకున్నట్లుగా వెంకయ్యనాయుడు చెప్పారు.

అయితే ఆయన ఆ మాట చెప్పిందే తడవుగా.. పత్రికలన్నీ కూడా వెంకయ్యనాయుడు 2020లో రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారంటూ అనేక కథనాలు వండి వార్చాయి. ఈ కథనాలు నష్టం చేస్తాయేమోనని వెంకయ్య సన్నిహితులు భావిస్తున్నారు. ఎందుకంటే.. వెంకయ్య మాట్లాడుతూ.. ‘‘తాను 2020లో రిటైర్ కావాలని అప్పట్లో అనుకున్నట్లుగా’’ మాత్రమే వెల్లడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2017లో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి కాబోతున్న ఆయన, 2022 వరకు ఆ పదవిలో హాయిగా కొనసాగగల అవకాశం ఉంది. మరి 2020 రాగానే ఉపరాష్ట్రపతి పదవిని కూడా త్యాగం చేస్తారనే అర్థం వచ్చేలాగా మీడియాలో వస్తున్న కథనాలు ఉంటున్నాయి.

రిటైర్మెంటు అనే ప్రస్తావన రాజకీయాల్లో ఉన్నప్పటి ఆలోచన అనీ.. ఇప్పుడు రాజకీయాల్తో నిమిత్తం లేని రాజ్యాంగ పదవిలోకి వెళుతున్నందున.. ఇప్పుడిక రిటైర్మెంటు అనేది ఆలోచనలోకి రాదని వారు అంటున్నారు. మీడియా వారు, ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేక 2020 లో వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి కూడా రాజీనామా చేసేస్తారు.. అనే అర్థాలు వచ్చేలా కొన్ని కథనాలు ఇచ్చేస్తున్నారంటూ ఆందోళన చెందుతున్నారు.

వాస్తవంలోకి వస్తే.. వెంకయ్యనాయుడు తన రిటైర్మెంటు అనే ఆలోచనను ఇక పూర్తిగా మానుకున్నట్లే! ఉపరాష్ట్రపతి పదవిలో పూర్తికాలం కొనసాగుతారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బహుశా ఈ పదవీకాలం పూర్తయ్యేనాటికి కాలం కలసి వస్తే.. పరిస్థితులు అనుకూలిస్తే.. చాలామంది ఆయన కోటరీలోని నాయకులు కోరుకుంటున్నట్లుగా, అటునుంచి అటు రాష్ట్రపతి పదవి వైపుగా వెళ్లడానికి కూడా వెంకయ్యనాయుడు సుముఖంగానే ఉంటారని అర్థమవుతోంది.