Begin typing your search above and press return to search.

మోడీపై అసలు సీక్రెట్ చెప్పిన వెంకయ్య!

By:  Tupaki Desk   |   1 Aug 2017 6:00 AM IST
మోడీపై అసలు సీక్రెట్ చెప్పిన వెంకయ్య!
X
తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థి చేసిన తర్వాత.. వెంకయ్యనాయుడు అదివరకటి భిన్నంగా చాలా మాటలు చెబుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి తాను ప్రధాని పదవికి మోడీకి పోటీ అవుతాననే ఉద్దేశంతో.. తనను ఈ పదవికి పంపుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే.. పార్టీలో వాజపేయి, అద్వానీ తర్వాత.. తానే అందరికంటె సీనియర్ని అంటూ.. మోడీ తనకు జూనియర్ అని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. తాజాగా మరో సంగతి కూడా బయటపెట్టారు. ఇంచుమించుగా.. ‘మోడీ ప్రధాని కావడం అనేది తన పుణ్యమే’ అని సెలవిచ్చారు.

ఇప్పటిదాకా మోడీ ప్రధాని కావడానికి ప్రజలు అనేక కారణాలను అనుకుంటూ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా చేపట్టిన అభివృద్ధి పనులు, సాధించిన క్రేజ్ , దేశవ్యాప్తంగా అందరు ప్రజల దృష్టిని కూడా గుజరాత్ వైపు ఆకర్షించడం వంటి అనేక విజయాలను పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా ఆయనకు ఏర్పడిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి భాజపా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లుగా అందరూ అనుకుంటూ ఉన్నారు. పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా కొన్ని వివాదాలున్నా, అవినీతి రహిత పాలన అందించిన నాయకుడిగా ఉన్న క్రేజ్ ను పురస్కరించుకునే ఆయనకు అభ్యర్థిత్వం దక్కిందని అంతా అనుకుంటున్న తరుణంలో వెంకయ్యనాయుడు మరో కొత్త సంగతి చెప్పారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ పనితీరును ఆయనే మొదటిసారిగా గుర్తించి.. అప్పట్లో పార్టీ అగ్రనాయకుడిగా ఉన్న అద్వానీకి మోడీ పేరును చెప్పారుట. మోడీని ప్రధానిగా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారుట. అందువల్లనే మోడికి అభ్యర్థిత్వం దక్కిందని ఇప్పుడు చెబుతున్నారు. ఔరా.. ఇన్నాళ్లూ ఎవరికి తెలియదే.. ! అందుకే వెంకయ్య పట్ల కృతజ్ఞతతో మోడీ కీలక శాఖలను అప్పగించడంతో పాటూ.. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా చేసేస్తున్నారని అనుకోవాలేమో.