Begin typing your search above and press return to search.

ధైర్యమంటే వెంకయ్యదేనంట

By:  Tupaki Desk   |   15 Sep 2016 5:53 AM GMT
ధైర్యమంటే వెంకయ్యదేనంట
X
భావోద్వేగం భారీ ఎత్తున ఉన్న వేళ.. అందుకు భిన్నంగా గళం విప్పటానికి రాజకీయనేతలు జంకుతారు. ఇది ఇప్పటికే నిరూపితమైన నిజం. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీలో చోటు చేసుకున్నాయి. విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. అందుకు సవాలక్ష కారణాలు చూపుతున్న మోడీ సర్కారు.. ఇటీవలే హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీని స్వాగతించినప్పటికీ ఏపీ అధికారపక్షం తన అసంతృప్తిని నర్మగర్భంగా వ్యక్తం చేయగా.. విపక్షాలైన వైఎస్సార్ కాంగ్రెస్ మొదలు.. కాంగ్రెస్.. వామపక్ష వాదులంతా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ప్యాకేజీని పాడైపోయిన లడ్డూలతో పోల్చి హాట్ హాట్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

హోదా అంశం ఏపీలో ఒక భావోద్వేగ అంశంగా మారి.. హోదా కావాలంటూ సీమాంధ్రులు ఒక్కటై కోరుకుంటున్న వేళ.. ఏపీ కమలనాథులు ఇందుకు భిన్నంగా.. తమ అధినాయకత్వం ప్రకటించిన ప్యాకేజీపై ప్రచారాన్ని షురూ చేశారు. ఏపీ నేతలకు దన్నుగా నిలిచేలా కేంద్రం నుంచి వెంకయ్య నాయుడు నడుం బిగించారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నానికి వచ్చిన వెంకయ్య.. ఏపీ కిచ్చిన ప్యాకేజీ మీద పొగడ్తల వర్షం కురిపించారు.

ఏ దేశంలోనూ ఒక కొత్త రాష్ట్రం రెండేళ్ల వ్యవధిలో సాధించని నిధుల్ని ఏపీ పొందిందని చెప్పిన ఆయన.. ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. హోదా లేకపోతే పరిశ్రమలు రావని.. రాయితీలు ఉండవని అంటున్నారని.. ఈ రెండింటికి అస్సలు సంబంధం లేదన్న వెంకయ్య ఈ ఏడాది మొదట్లో విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో రూ.4.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు రావటాన్ని ప్రస్తావించారు.

హోదా మీద ఏపీలో పెద్ద ఎత్తున సెంటిమెంట్ నడుస్తున్న వేళ.. ఆ అంశానికి భిన్నంగా మాట్లాడే ధైర్యం చేయటం ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న వేళ.. తెలంగాణకు వ్యతిరేకంగా నోట్లో నుంచి మాట రావటానికి కూడా ఎవరూ ధైర్యం చేసే వారు కాదు. కేంద్రమంత్రుల నుంచి తెలంగాణ రాష్ట్ర నేతల వరకూ ఎవరూ అలాంటి ధైర్యం చేసే వారు కాదు. కానీ.. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏపీలో ఉండటం గమనార్హం.

ఇలాంటి విషయాలకు సంబంధించి పవన్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటే.. ఏపీని విడదీస్తానని ఏపీలోనే బీజేపీ తీర్మానం చేస్తుందా? ఎంత ధైర్యం? ఎంత సాహసం అంటూ నిప్పులు చెరిగి కొద్దిరోజులు కూడా కాక ముందే బీజేపీ నేతలు తాజాగా తామిచ్చిన ప్యాకేజీ (పవన్ లాంటి వారి దృష్టిలో పాచిపోయిన లడ్డూలు) గురించి ఏపీకి వచ్చి మరీ గొప్పలు చెప్పుకోవటం గమనార్హం. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నోటి వెంట ఒక్క మాట మాట్లాడటానికి కూడా రాని ధైర్యం.. ఈ రోజున సీమాంధ్రుల మనోభావాలకు భిన్నంగా ఎలా మాట్లాడుతున్నారన్నది ఒక ప్రశ్న. తెలంగాణలో కుదరనిది.. ఏపీలో ఎలా కుదురుతోందన్న సందేహం రాక మానదు.

తాము కోరుకున్న హోదాకు భిన్నంగా కంటితుడుపు ప్యాకేజీ ఇవ్వటమే కాదు.. దాని గురించి గొప్పలు చెబుతున్న ఏపీ కమలనాథుల్ని చూస్తున్నప్పుడు సగటు సీమాంధ్రుడి మనసులో కలిగే ఆవేదనే చూస్తే.. ఎందుకిలా జరుగుతోంది? ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా.. వారి మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటానికి బీజేపీ నేతలకు అంత ధైర్యం ఎలా వచ్చింది? అన్న సందేహాలు కలుగక మానవు. తమను అవమానపరిచేలా కమలనాథులు అంతలా ఎలా మాట్లాడుతున్నారు? వారే ధైర్యంతో ఇలాంటి మాటలు చెబుతున్నారు? ఇదంతా సీమాంధ్రుల చేతకానితనంతోనే జరుగుతుందా? లాంటి భావనలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్రుల మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకుబదులిచ్చే వారెవరు?