Begin typing your search above and press return to search.

ఇలాంటివి వెంకయ్య దగ్గరే నేర్చుకోవాలి

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:08 AM GMT
ఇలాంటివి వెంకయ్య దగ్గరే నేర్చుకోవాలి
X
సాధారణంగా ఎవరైనా మంచి పని చేస్తే.. గుర్తించి పొగిడేస్తారు. ఒకవేళ తాము చేసిన పనిని గుర్తించకున్నా పెద్దగా పట్టించుకోరు. కానీ.. కొందరు మాత్రం ఇందుకు భిన్నం. తరచూ తాము చేసే గొప్ప పనుల్ని చెప్పుకోవటం.. పొగడరే అన్న మాటను పరోక్షంగా చెబుతూ.. తానుచేస్తున్న పనికి లభించిన ప్రశంసల్నిఆసక్తికరంగా చెప్పుకుంటుంటారు. ఇలాంటి వాటిల్లో సిద్ధహస్తుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

ఏపీ కోసం.. ఏపీ అభివృద్ధి కోసం తాను పడే తపన అంతా ఇంతా కాదని.. ఏపీకి తానెంత చేస్తున్నానో చెప్పుకునేందుకు వెంకయ్య పడే తాపత్రం అంతా ఇంతా కాదు. ఎవరైనా గుర్తించే వరకూ ఆగటం ఎందుకని.. తనకుతానే తన గొప్పతనం గురించి చెప్పేసుకుంటారు. ఇందుకు ప్రముఖులు..తనను ఉద్దేశించి కోట్ చేసే మాటల్ని సమయం చూసుకొని (మీడియా వాళ్ల దృష్టికి వెళ్లేలా) చెప్పటంలో వెంకయ్య తర్వాతే ఎవరైనా.

ప్రత్యేక హోదా ఎపిసోడ్ లో ప్రతి ఆంధ్రుడిలోనూ వెంకయ్య మీద ఉన్న గుస్సా అంతా ఇంతా కాదు. ఆ విషయం తెలిసినా తెలియనట్లుగా వ్యవహరించే వెంకయ్య.. తాజాగా తాను ఏపీ కోసం ఎంతగా కృషి చేస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు. జైట్లీ తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపులు ఇవ్వటం తెలిసిందే. ఇదంతా తాను చేసిన కృషే అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఒకసారి తాను.. ఎంపీ గల్లా జయదేవ్ లు తదితర నేతలతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించానని.. ఆ సందర్భంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తమను కలిశారన్నారు.

ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము భూములు అమ్ముకోలేదని.. ప్రభుత్వానికి ఇచ్చామని.. అందుకే తమకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారని గుర్తుచేసుకున్నారు. అదే విషయాన్ని జైట్లీకి చెప్పగా.. పరిశీలిస్తామని చెప్పి తాజా బడ్జెట్ లో అందుకు తగ్గట్లే నిర్ణయం తీసుకున్నారన్నారు. తాజాగా తాను ఏపీకి సంబంధించిన ఒక పని కోసం జైట్లీ వద్దకు వెళ్లగా.. ‘‘ఏం వెంకయ్యా జీ.. అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విషయాన్ని నేను గుర్తు పెట్టుకొని మరీ బడ్జెట్ లో ప్రకటించాను. అయినా మీకు సంతృప్తి లేదా?’’ అంటూ సరదాగా ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. ఏ మాటకు ఆ మాటే చేసిన పనుల గురించి చెప్పుకోవటం వెంకయ్య తర్వాతే ఎవరైనా కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/