Begin typing your search above and press return to search.

వెంకయ్య చెప్పిన లెస్ క్యాష్ లాజిక్ ఇదే!

By:  Tupaki Desk   |   19 Dec 2016 4:05 AM GMT
వెంకయ్య చెప్పిన లెస్ క్యాష్ లాజిక్ ఇదే!
X
వార‌మంతా ప‌నిచేస్తామ‌ని ఎవ‌రైనా అన్నారంటే.. ఆ మాటకు అర్ధం ఏమిటి? అదేమి ప్రశ్న... ఆదివారం మిన‌హా మిగిలిన ఆరు రోజులు పని చేస్తామని చెప్పడమే కదా! మరి ఈ లాజిక్ తెలిసిన సామాన్యుడికి మోడీ ప్రకటించిన క్యాష్ లెస్ ఎకానమీ అంటే అర్ధం తెలియకపోవడం విడ్డూరమనే చెప్పాలి! ఈ మాట అంటుంది మరెవరో కాదు.. కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు. ఇంతకూ ఈయన లాజిక్కులకే లాజిక్ అయిన ఈ మాటను ఏ సందర్భంలో అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి వక్త అనాలంటే, తెలివైన మాటకారి అని పొగడాలంటే వారికి రెండు నాలుకలు ఉండాలా? అవసరం లేదేమో... ఒక్క నాలుకతోనే రకరకాలుగా తిప్పి చెప్పొచ్చు! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే... ఈ సమయంలో భారతదేశాన్ని రక్షించడానికి వచ్చిన దేవదూత మోడీ అనడం, మోడీ పేరుకు మేకింగ్ ఆఫ్ మోడ‌ర‌న్ ఇండియా అని అర్థం చెప్పడం - పెద్ద నోట్ల ర‌ద్దు త‌రువాత ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను ప్ర‌స‌వ వేద‌న‌గా అభిర్ణించడం వంటి కార్యక్రమాలకు తెరలేపిన వెంకయ్య నాయుడు తన వాక్ చాతుర్యంతో ప్ర‌త్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత గొప్ప‌దో కూడా గతంలో చెప్పారు, దీంతో కళ్లు తెరుచుకున్న ఎందరో ఆంధ్రులు ఆయనకు ఘన సన్మానాలు కూడా చేశారు. అదే కారణమో ఏమో కానీ... తాజాగా క్యాష్ లెస్ అంటే ఏమిటో తనదైన శైలిలో చెప్పారు వెంకయ్య.

కృష్ణా జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కేంద్రం ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తున్న క్యాష్ లెస్ లావాదేవీల గురించి మాట్లాడిన వెంకయ్య నాయుడు... వార‌మంతా ప‌నిచేస్తామ‌ని ఎవ‌రైనా అన్నారంటే... దానర్ధం ఆదివారం మిన‌హా మిగిలిన అన్ని రోజులూ చేస్తామని! ఆరోజు సెలవు అనే విష‌యాన్ని ఎవ్వ‌రూ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌ని అర్ధం అనే లాజిక్కు తీశారు. అలాగే... క్యాష్ లెస్ ఎకాన‌మీ అంటే మొత్తానికి డబ్బులు లేకుండా చేయడం కాదని తక్కువ నగదు (లెస్ క్యాష్ ఎకాన‌మీ) అని సెలవిచ్చారు! ఈ లాజిక్ ఇంతవరకూ బాగానే ఉంది కానీ... భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా చేస్తామని ప్రకటించడం అంటే, అమెరికా, చైనా వంటి దేశాలకు కాదు జింబాబ్వే వంటి దేశాలకు పోటీగా అని మరో నానార్ధం ఏమీ లేదు కదా అనే కొత్త టెన్షన్ మొదలైందట చాలా మంది సామాన్యులకు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/