Begin typing your search above and press return to search.

జీఎస్టీపై వెంక‌య్య ప్ర‌సాపోన్యాసం విన్నారా?

By:  Tupaki Desk   |   2 July 2017 8:13 AM GMT
జీఎస్టీపై వెంక‌య్య ప్ర‌సాపోన్యాసం విన్నారా?
X
వ‌స్తు, సేవ‌ల పన్ను (జీఎస్టీ)పై దేశవ్యాప్తంగా జ‌రుగుతున్న చర్చ‌ల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్న జూన్ 30 అర్ధ‌రాత్రి వేళ‌... న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్టీ ప‌న్నుకు గంట కొట్టేసింది. ఆ మ‌రుక్ష‌ణ‌మే దేశంలో కొత్త ప‌న్ను అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టైంది. ఇక అన్నింటా జీఎస్టీ వ‌ర్తింపుతో ఇస్తున్న బిల్లులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఒకే దేశం- ఒకే ప‌న్ను ఎక్క‌డ అంటూ జ‌నం త‌మ చేతికి వ‌చ్చిన జీఎస్టీ ప‌న్ను స‌హిత బిల్లుల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని మోదీ సర్కారు నుంచి స‌వివ‌ర‌మైన స‌మాధానం రావాల్సి ఉంది. అయితే కొత్త ప‌న్ను వ్య‌వ‌స్థ అమ‌ల్లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేందుకు కాస్తంత టైమ్ ప‌డుతుంద‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హిస్తే... ఇంకొన్ని రోజుల్లోనైనా జీఎస్టీ అమ‌లు విధానం చ‌క్క‌బ‌డ‌క‌పోతుందా? అన్న ఆశ లేక‌పోలేదు.

ఈ క్ర‌మంలో నిన్న అటు ఢిల్లీలో మోదీ - ఇటు హైద‌రాబాదులో బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర పట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు వేర్వేరు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌సంగాలు చేశారు. న‌ల్ల ధ‌నాన్ని వెలికి తీస్తామ‌ని, అక్ర‌మార్కుల ఆట‌లిక సాగ‌బోవ‌ని మోదీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. వెర‌సి న‌ల్ల కుబేరుల‌కు ఆయ‌న సింహ‌నాదం వినిపించారు. ఇక వెంక‌య్య‌నాయుడు విష‌యానికి వ‌స్తే... అస‌లు జీఎస్టీ ప‌న్నును తాము ఎందుకు అమ‌లు చేస్తున్నామ‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ త‌న‌దైన సెటైరిక్ ప్ర‌సంగం చేశారు. అభివృద్ధి ఫ‌లాలను అంద‌రికీ పంచాల‌న్న ఉద్దేశంతోనే తాము జీఎస్టీ ప‌న్ను విధానాన్ని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కొత్త ప‌న్ను వ్య‌వ‌స్థ‌పై విమ‌ర్శ‌లు ఎంత‌మాత్రం సమంజ‌సం కాద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోట ఓ ప్రాసతో కూడిన వ్యాఖ్య కూడా దూసుకువ‌చ్చేసింది. ‘ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తద్వారా జీఎస్టీని వ్య‌తిరేకిస్తూ కామెంట్లు చేస్తున్న వారికి ఆయ‌న చుర‌క‌లు అంటించేశారు. దేశంలో ఆర్థికంగా ఎద‌గ‌డానికి అంద‌రికీ అవ‌కాశాలు ఉండాలని ఆయ‌న చెప్పారు. ప్ర‌పంచంలోని ఎన్నో దేశాల్లో ఈ విధానం విజ‌య‌వంతంగా అమ‌లులో ఉందని అన్నారు. ఒక దేశం ఒకే ప‌న్ను జీఎస్టీ విధానం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ ప‌ద్ధ‌తి ద్వారా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు లాభం చేకూరుతుందని స్ప‌ష్టం చేశారు. జీఎస్టీ ఒక విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యమ‌ని అన్నారు. దేశంలోని అస‌మాన‌త‌ల‌ను తొల‌గించేందుకు త‌మ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. సామాన్యులు వాడే 80 ర‌కాల వ‌స్తువుల‌పై కేవ‌లం 5 శాతం మాత్ర‌మే ట్యాక్స్ వేసిన‌ట్లు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/