Begin typing your search above and press return to search.

వాళ్లు ఛీకొట్టడాన్ని త్యాగం కింద చెప్తున్న వెంకయ్య!

By:  Tupaki Desk   |   5 Sep 2016 4:48 AM GMT
వాళ్లు ఛీకొట్టడాన్ని త్యాగం కింద చెప్తున్న వెంకయ్య!
X
ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరిలోకీ వెంకయ్య నాయుడు అంత తెలివైన మాటల మరాఠీ మరొకరు లేరని ప్రజలు అనుకుంటూ ఉంటారు. మాటలతో తిమ్మిని బమ్మి చేయడంలో ఆయన దిట్ట అనేది ప్రజల భావన. ఆయన తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్‌ కోసం చాలా పెద్ద త్యాగం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. నిజానికి వాస్తవాలు వేరైనప్పటికీ.. ఆ పరిస్థితుల్ని తాను చేసిన త్యాగం కింద ఆయన బిల్డప్‌ ఇచ్చుకుంటున్నారంటూ జనం జోకులేసుకుంటున్నారు.

వెంకయ్యనాయుడు మొన్నమొన్నటిదాకా కర్ణాటక నుంచే రాజ్యసభ ఎంపీగా నెగ్గుతూ వచ్చారు. భాజపా కేంద్ర నాయకత్వంలో ఎవరు చక్రం తిప్పుతోంటే వారికి విధేయుడుగా ఉండే నేత గనుక, ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నడూ ఢోకా రాలేదు. ప్రతిసారీ కర్ణాటక నుంచి ఆయన రాజ్యసభ ఎంపీ అవుతూ వచ్చారు. ఆయన సొంత రాష్ట్రం ఏపీలో ఎన్నడూ భాజపాకు రాజ్యసభ ఎంపీ అయ్యేంత సీన్‌ లేదు గనుక.. ఆయన కర్ణాటకమీద ఆధారపడి మనుగడ సాగిస్తూ వచ్చారు. అయితే పార్టీ నిబంధనలను కూడా కాదనుకుని, వెంకయ్యనాయుడుకు మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించాలనుకున్నప్పుడు, కర్ణాటక పార్టీ శాఖలో బాగా వ్యతిరేకత వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా పాంప్లెట్లు వేశారు. సోషల్‌ మీడియాలో చాలా దారుణంగా నెగటివ్‌ ప్రచారం చేశారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి.. పార్టీలోని ఒక వర్గం.. అక్కడ ఆయనకు ఓటు వేయకపోయే పరిస్థితి ఉందనే భయం ఏర్పడిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

దాంతో ముందుజాగ్రత్త పడ్డ వెంకయ్య అధిష్టానం ద్వారా రాజస్తాన్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సర్లెద్దూ ఆయనేదో పదవికోసం ఆ పాట్లన్నీ పడ్డారు అని అనుకోవచ్చు. కానీ.. ఆయన వాటిని తాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం చేసిన త్యాగాలుగా అభివర్ణిస్తూ ఉండడమే దారుణంగా ఉంది. తాను కర్ణాటక నుంచి గెలిచినా సరే.. ఎప్పుడూ ఏపీ గురించి మాట్లాడుతూ ఉంటానని అక్కడి నాయకులు తనను విమర్శించారట. అందుకు మనస్తాపం కలిగి అసలు పోటీనుంచి తప్పుకోవాలని భావించారట. కానీ చివరి నిమిషంలో పార్టీ రాజస్తాన్‌ నుంచి ఎంపీ చేసిందిట. ఆయన ఇలా తనమీద కర్ణాటక నేతల్లో ఉన్న అసంతృప్తికి వక్రభాష్యం చెప్పుకుని సింపతీకోసం ప్రయత్నిస్తున్నారని జనం భావిస్తున్నారు. అంతా తాను ఏపీ కోసం చేసిన త్యాగమే అన్నట్లుగా ఆయన మాట్లాడడం చిత్రంగా ఉన్నదనం జనం అనుకుంటున్నారు.