Begin typing your search above and press return to search.

స్మార్ట్ సిటీలపై కూడా బురిడీ కొట్టిస్తున్నవెంకయ్య

By:  Tupaki Desk   |   11 Oct 2015 4:05 AM GMT
స్మార్ట్ సిటీలపై కూడా బురిడీ కొట్టిస్తున్నవెంకయ్య
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వాక్చాతుర్యంలో ఎంతటి మొనగాడో అందరికీ చాలా బాగా తెలుసు. ఒకే విషయాన్ని ఆయన జనాన్నందరినీ ఊరించేలా.. తెగ ఆకర్షణీయంగా చెప్పగలరు. ఆయన మాటలు పదేపదే వినడం వల్ల.. జనంలో ఎవరైనా దాని గురించిన ఆశలు పెట్టుకోవడం ప్రారంభిస్తే.. అంతలోనే.. దాన్ని అంత ఎక్కువగా నమ్ముకోవద్దంటూ పుల్లవిరుపుగా కూడా వెంకయ్య మాట్లాడగలరు. ఇప్పుడు స్మార్ట్ సిటీల వ్యవహారంలో కూడా అదే జరుగుతోంది. తన మీద ప్రజలు ఏయే విషయాల్లో అయితే ఆశలు పెంచుకుంటూ ఉంటారో.. ఆయా అంశాల్లో వారి ఆశలను విరిచేయడం అనేది.. వెంకయ్యనాయుడు అనుసరిస్తున్న తాజా టెక్నిక్ గా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేంద్ర పట్టణభివ్రుద్ది శాఖ మంత్రిగా ఆయన చేతిలో ఉన్న వరాలు స్మార్ట్ సిటీలకు సంబంధించినవి మాత్రమే.. ఆ విషయంలో కూడా ఆయన ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు.

వివరాల్లోకి వెళితే.. వెంకయ్యనాయుడు తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ అనేది అల్లావుద్దీన్ అద్భుత దీపం ఎంతమాత్రమూ కానే కాదని తేల్చేశారు. అది మాయలు చేసే దీపం కాకపోవచ్చు. కానీ వెలుతురు ఇచ్చే లాంతరు అయినా అవుతుందా లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇంకా రాష్ట్రప్రభుత్వాలతో కలసి ఏయే మోడల్ లో ఏయే నగరాన్ని స్మార్ట్ గా డెవలప్ చేయాలో నిర్ణయించాల్సి ఉంది అంటూ వెంకయ్యనాయుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు ఎన్ని రకాలుగా మాటలు మార్చి వంచించారో అందరూ గమనించారు. తొలుత పదేళ్లు హోదా ఉండాలనే డిమాండుతో పాత ప్రభుత్వాన్ని బెదరగొట్టిన ఆయనే పాలన తమ చేతికి వచ్చిన తర్వాత.. అది ఇవ్వకపోయినా ఏమీ నష్టం ఉండదంటూ ఎన్ని మయమాటలు చెప్పారో అందరికీ తెలుసు. చివరికి ప్రత్యేక హోదా అంటే అదేమీ జిందా తిలిస్మాత్ కాదని వెటకారం చేయడం కూడా వెంకయ్యనాయుడుకే చెల్లింది. ఆయన ప్రస్తుతం స్మార్ట్ నగరాల విషయంలోనూ అదే తరహా వెటకారపు పోకడల్ని అనుసరిస్తున్నారు.

స్మార్ట్ అంటున్న నగరాలకు సంబంధించి.. వాస్తవంగా ఎంత నిధులు ఇస్తారు.. వాటితో ఏయే పనులు చేస్తారు? ఎలాంటి కొత్త ప్రగతి ఉంటుంది. ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే భాగస్వాములుగా విదేశీ మరికు అంతర్జాతీయ కంపెనీలకు ఎంతెంత లబ్ధి చేకూరేలా ప్రాజెక్టు డిజైన్ ఉంటుంది.. ఇలా కీలకమైన విషయాలు ఏమీ ఆయన వెల్లడించడం లేదు. అన్ని సందేహాలకు జవాబులను దాటవేస్తూ.. స్మార్ట్ సిటీలంటే ఉండే మౌలిక మైన విధివిధానాలను మాత్రమే వెల్లడి చేస్తున్నారు. వెంకయ్య దాపరికం వైఖరి గమనిస్తోంటే.. స్మార్ట్ సిటీలు కార్యాచరణలోకి వచ్చి.. వాటిలో.. ప్రెవేటు కంపెనీలకు ఎలాంటి లబ్ది ఉండబోతున్నదో తేలిన తర్వాత.. చాలా చికాకులు మొదలయ్యేలా కనిపిస్తోంది.