Begin typing your search above and press return to search.

హ్యండిచ్చిన వెంకయ్యకు ఏపీ దిక్కైంది

By:  Tupaki Desk   |   30 April 2016 7:21 AM GMT
హ్యండిచ్చిన వెంకయ్యకు ఏపీ దిక్కైంది
X
అదేం దరిద్రమో కానీ.. దేశంలో మరే రాష్ట్రానికి చెందిన నేతకూ లేని ఒక దరిద్రపు అలవాటు సీమాంధ్ర ప్రాంత నేతలకు ఉంటుంది. దేశంలో ఏ నేత అయినా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి లేదా రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతులేని ప్రేమను ప్రదర్శిస్తారు. తన ప్రాంతానికి ఎంతోకొంత చేయాలని తపిస్తుంటారు. అందుకోసం ఎంతోకొంత కృషి చేస్తారు. తమకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కృషి చేయటం కనిపిస్తుంది. కానీ.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు మాత్రం.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఎంతటి అన్యాయం జరిగినా నోరు విప్పటానికి పెద్దగా ఇష్టపడరు.

కేంద్రంలోని మోడీ సర్కారులో కీలకభూమిక పోసిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్నే తీసుకోండి. విగ్రహపుష్టి.. నైవేధ్య నష్టిలా ఉంటారు. పేరు ప్రఖ్యాతులున్నా.. సొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో పెద్దగా కనిపించదు. అలాంటి వెంకయ్యకు ఈ రోజున రాజ్యసభ పదవి రావాలంటే చివరకు ఏపీనే దిక్కు అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆయనిప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఆయన ఎన్నికయ్యే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీలో ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో ఒక రాజ్యసభ సీటు పక్కాగా దక్కే వీలుంది. మరో సీటు కోసం విపరీతమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వెంకయ్య పదవీ కాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసేందుకు ఏపీ మినహా మరో రాష్ట్రంలో ఆయనకు అవకాశం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సొంత రాష్ట్రానికి ఏమీ చేయని వెంకయ్యకు ఈ రోజున రాజ్యసభ పదవి పొందే అవకాశం ఆయన ఏమీ చేయని ఏపీనే ఇవ్వాల్సిన పరిస్థితి. తనకెంతో చేసే రాష్ట్రానికి తానేం చేస్తున్నానన్న విషయాన్ని వెంకయ్య కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో..?