Begin typing your search above and press return to search.

ఆ అయిదుగురికి వారసుడిగా వెంకయ్య

By:  Tupaki Desk   |   18 July 2017 6:43 AM GMT
ఆ అయిదుగురికి వారసుడిగా వెంకయ్య
X
దేశ చరిత్రలో తెలుగువారికి ప్రత్యేక పేజీలున్నాయి. స్వాతంత్ర్యానంతర భారత దేశంలోనూ అత్యున్నత పదవుల్లో తెలుగువారు కొలువయ్యారు. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి... ప్రధానిగా పీవీ నరసింహరావు - లోక్ సభ స్పీకర్ గా బాలయోగి - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు - ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వీఎస్ రమాదేవి పనిచేశారు... ఇప్పుడు వారందరి వారసుడిగా మరో అత్యున్నత పదవైన ఉప రాష్ర్టపతి పీఠానికి తద్వారా పెద్దల సభ ఛైర్మన్ పీఠానికి చేరువవుతున్నారు వెంకయ్యనాయుడు. ఉప రాష్ర్టపతి పదవికి ఆయన ఎన్డీయే మద్దతుతో నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది.

వెంకయ్యనాయుడి ప్రస్థానం ఇంతవరకు సాగడానికి ఆయన సైద్ధాంతిక ఆచరణ - చిత్తశుద్ధే కారణం. తెల్లని పంచె - చొక్కాతో సాధారణ వ్యక్తిగా కనిపించే వెంకయ్యనాయుడుది అత్యంత సునిశిత పరిశీలనా దృష్టి. తొలి చూపులోనే అవతలి వ్యక్తిని మొత్తంగా చదివేసే సామర్థ్యం ఆయనకుంది. వాస్తవాలను జీర్ణించుకొని మార్పును వెంటనే అంగీకరించడం ఆయనలోని మరో గొప్ప లక్షణం.

ఏపీలో బీజేపీ బలంగా లేకున్నా.. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలో అంతంతమాత్రమే అయినా కూడా ఏపీ నుంచి ఆయన జాతీయ స్థాయి నేతగా ఎదిగారంటే అది పూర్తిగా ఆయన కృషే అని చెప్పాలి.

ఇదీ ప్రస్థానం..

* 1977లో ఒంగోలులో జనతాపార్టీ నుంచి లోక్‌ సభకు పోటీచేసి ఓడిపోయారు.

* 1978లో అదే జనతాపార్టీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

* 1978లో ఇందిరాగాంధీ ప్రభంజనంలో - 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఒంటరిగా పనిచేసి గెలిచారు.

* 1985లో తెలుగుదేశం పొత్తుతో ఉదయగిరి నుంచి కాక ఆత్మకూరులో పోటీచేసి కొద్ది ఓట్లతో ఓటమి పాలయ్యారు.

* ఆ తరువాత వెంకయ్య జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణం కోసం ఆయన పడిన తపన - చిత్తశుద్ధి - నిజాయితీ అగ్రనేతలైన వాజ్‌ పేయి - అద్వానీలను ఆకట్టుకున్నాయి. 1993లో అద్వానీ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత వెంకయ్యను జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు.

* 1989లో బాపట్ల - 1996లో హైదరాబాద్‌ లోక్‌ సభకు పోటీచేసి ఓడిపోయారు.

* 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

* గత ఏడాది రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

* వాజ్‌ పేయ్‌ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధిమంత్రిగా పనిచేశారు.

* మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిమంత్రిగా పనిచేశారు.