Begin typing your search above and press return to search.

కరోనా కట్టడిలో జగన్ సూపర్..వెంకయ్య ప్రశంసే సాక్ష్యం

By:  Tupaki Desk   |   18 April 2020 5:00 PM GMT
కరోనా కట్టడిలో జగన్ సూపర్..వెంకయ్య ప్రశంసే సాక్ష్యం
X
ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేయడంలో ఏపీలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు అంతగా కృషి చేయడం లేదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇదంతా నిన్నటిదాకా ఉన్న పరిస్థితి. ఇకపై ఈ విషయంలో జగన్ ను విమర్శించడం, జగన్ సర్కారును కార్నర్ చేయడం అంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో జగన్ కు భారీ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఏపీలో జగన్ సర్కారు కరోనా వ్యాప్తి కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు సూపరంటూ వెంకయ్య కితాబిచ్చిన నేపథ్యంలో ఇంకెవ్వరూ జగన్ ను తప్పుబట్టలేరు కదా.

కరోనా మహమ్మారి మన దేశంలోకి, ఏపీలోకి ప్రవేశించిన సమయంలోనే జగన్ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అయితే ఈ ఎన్నికల్లో పరాజయం నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతున్న విపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు ఎలాగైనా ఎన్నికలను వాయిదా వేయించే దిశగా చర్యలు చేపట్టేశాయన్న వార్తలు వెలువడ్డాయి. ఇదే క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... తన సొంత సామాజిక వర్గానికి చెందిన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో ఎన్నికలను వాయిదా వేయించేశార్న వాదనలు వినిపించాయి. ఆ నెపం తమ మీదకు రాకుండా కరోనాను జగన్ చాలా ఈజీగా తీసుకున్నారని, ఆ కారణంగానే రాష్ట్రంలో వైరస్ విస్తరణ ఓ రేంజిలో పెరిగిపోయిందని విమర్శలు సంధించింది.

ఈ తరహాలో వచ్చిన విమర్శలను జగన్ ఏమాత్రం పట్టించుకోకుండానే తన పని తాను చేసుకుంటూపోయారు. దేశంలోని చాలా రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా ఓ రేంజిలో ప్రతాపం చూపుతున్నా... ఏపీలో మాత్రం ఒకింత తక్కువ కేసులే నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లివచ్చిన వారి కారణంగానే ఏపీలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కరోనా కట్టడికి జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలపై వెంకయ్య శనివారం స్పందించారు. ఏపీలో కరోనా నివారణ చర్యలు జరుగుతున్న తీరు పట్ల వెంకయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకోవడం శుభపరిణామం అని అభినందించారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించవచ్చని, ఇది మంచి నిర్ణయం అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని కూడా వెంకయ్య పేర్కొన్నారు. వెంకయ్య ప్రశంసలతో జగన్ పై విమర్శలు సంధిస్తున్న వారంతా ఇప్పుడు కామ్ డౌన్ కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.