Begin typing your search above and press return to search.

పొగ‌డ్త‌ల్లో మీరు సూపర్ వెంక‌య్య‌గారు

By:  Tupaki Desk   |   2 Oct 2016 10:55 AM GMT
పొగ‌డ్త‌ల్లో మీరు సూపర్ వెంక‌య్య‌గారు
X
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట‌తీరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్వ‌త‌హాగా మాట‌కారి అయిన వెంక‌య్య త‌న వాగ్దాటిని ఈ మ‌ధ్య‌కాలంలో ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ-బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ - నెల్లూరు జిల్లాల కార్యకర్తలు వెంకయ్యనాయుడిని ఘనంగా సత్కరించిన‌పుడు సైతం ఇదే తీరులో మాట్లాడారు. ఈ 'ఆత్మీయ సభ'లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ త‌న గురించి కాస్త త‌క్కువ చెప్పి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించి ఎక్కువ చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని అంటున్నారు.

రాష్ట్రాన్ని ఏకపక్షంగా చీల్చి ఏపీకి అన్యాయం చేశారని, అలాంటి కాంగ్రెస్‌ మోడీని విమర్శించడం సరికాదని వెంక‌య్య‌నాయుడు అన్నారు. దేశ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిన కాంగ్రెస్‌ పై మోడీ దృష్టిపెట్టకుండా - దేశాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళుతున్నారన్నారు. దేశంలో మోడీ - రాష్ట్రంలో చంద్రబాబునాయుడు జోడి సూపర్‌ గా ఉందని వెంక‌య్య ప్ర‌శంసించారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఆందోళన చెందుతున్నాడని చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ మోడీనే ప్రధాని అని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని వెంక‌య్య‌నాయుడు అన్నారు. ఆ దిశగా కేంద్రంలో మంత్రివర్గం పనిచేస్తుందన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వకపోయినా అంత కన్నా ఎక్కువే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిందని, హామీలన్నీ నెరవేరుస్తున్నామని వెంక‌య్య చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్లలో చేయని అభివృద్ధిని మోడీ రెండేళ్లలో చేయగలరా మీరే చెప్పండంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ఎలాంటి రాజకీయ కక్షసాధింపు చర్యలూ లేకుండా ముందుకెళుతున్నారని తెలిపారు.

తనకు రాజకీయ వారసత్వం లేదని, జవసత్వంతో పైకి వచ్చానని వెంక‌య్య‌నాయుడు చెప్పారు. తాను వాజ్‌ పేయి మంత్రివర్గంలో ఉన్నపుడు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత సోనియాగాంధీ నియోజకవర్గానికి నిధులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదే రీతిలో ఇపుడు ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం వ‌ద్ద నిరంతరం ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని వెంక‌య్య చెప్పుకొచ్చారు. ఈ విష‌యం తెలియ‌ని వారు చేసే విమ‌ర్శ‌ల గురించి ప‌ట్టించుకోన‌ని వెంక‌య్య తేల్చిచెప్పారు.

ఇదిలాఉండ‌గా వెంకయ్యనాయుడు తిరుపతి పర్యటన సందర్భంగా ముంద‌స్తు అరెస్టులు చేశారు. హోదాపై హామీ ఇచ్చి విస్మరించిన వెంకయ్యనాయుడు గోబ్యాక్‌ అని పిలుపునిచ్చినందుకు వామపక్ష నేతలను ఎక్కడిక్కడ అరెస్టులు - గృహ నిర్బంధాలు చేశారు. వెంకయ్యనాయుడు కార్యక్రమం నేప‌థ్యంలో పోలీసులు అర్ధరాత్రివేళ వామపక్ష నేతల ఇళ్లపై దాడులు నిర్వహించి బలవంతపు అరెస్టు చేశారు. గాఢనిద్రలో ఉన్న నేతలను కట్టుబట్టల(లుంగీ - బనియన్‌)తోనే లాక్కెళ్లి వాహనం ఎక్కించి సుదూరంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. దీనిపై వామ‌ప‌క్ష నేత‌లు స్పందిస్తూ టీడీపీ-బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి ద్రోహం చేయడమే గాకుండా, తప్పని ప్రశ్నిస్తే పోలీసులతో నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ప్రజలకు వెంకయ్య నాయుడు అన్యాయం చేయడం వల్లనే 'వెంకయ్యనాయుడు గోబ్యాక్‌' పిలుపును వామపక్షాలు ఇచ్చాయన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/