Begin typing your search above and press return to search.

వెంకయ్యను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు..

By:  Tupaki Desk   |   29 May 2016 1:56 PM GMT
వెంకయ్యను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు..
X
ఊహాగానాలకు తెర పడినట్లే. గడిచిన కొద్దిరోజులుగా రాజ్యసభకు ఎన్నిక కానున్న నేతల మీద పెద్ద ఎత్తున అంచనాలున్న విషయం తెలిసిందే. అంచనాలకు తగినట్లే కొందరు నేతలకు రాజ్యసభకు పంపుతూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ బీజేపీ చరిత్రలో లేని విధంగా తెలుగు ప్రాంతానికి చెందిన వెంకయ్యనాయుడిని వరుసగా నాలుగోసారి రాజ్యసభకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇప్పటివరకూ ఉన్న సంప్రదాయం ప్రకారం.. బీజేపీలో ఏ నేతకైనా రాజ్యసభకు మూడుసార్లు మాత్రమే ఎంపిక చేస్తారు.

ఆ విధానానికి మినహాయింపు ఇస్తూ వెంకయ్యను నాలుగోసారి రాజ్యసభకు ఎంపి చేశారు. అయితే.. ఆయన్ను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారన్న అంచనాలు వ్యక్తమైన దానికి బదులుగా రాజస్థాన్ నుంచి ఆయన్ను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక.. ఏపీలో తమకు మిత్రపక్షమైన టీడీపీ తరఫున మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు అవకాశం దక్కేలా చేస్తారని భావించినా.. అలాంటిదేమీ జరగలేదు. నిర్మలా సీతారామన్ ను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12 మందిని నేతల్ని తొమ్మిది రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అత్యధికంగా రాజస్థాన్ నుంచి నలుగురు నేతల్ని రాజ్యసభకు ఎన్నిక కానున్నారు.

తాజాగా బీజేపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులు..

రాజస్థాన్ ; వెంకయ్యనాయుడు.. ఓం ప్రకాశ్ మాథుర్.. హర్షవర్థన్ సింగ్.. రాంకుమార్ వర్మ

హర్యానా ; చౌదరి బీరేంద్ర సింగ్

బీహార్ ; గోపాల్ నారాయణ్ సింగ్

మహారాష్ట్ర ; పీయుష్ గోయల్

కర్ణాటక ; నిర్మలా సీతారామన్

జార్ఖండ్ ; ముక్తర్ అబ్బాస్ నక్వీ

గుజరాత్ ; పురుషోత్తం రూపాల

చత్తీస్ గఢ్ ; రామ్ విచార్

మధ్యప్రదేశ్ ; అనిత్ మాధవ్ దవే