Begin typing your search above and press return to search.

నెల్లూరు అంటే అదేమైనా తూకం రాయా?

By:  Tupaki Desk   |   14 Sep 2015 10:42 AM GMT
నెల్లూరు అంటే అదేమైనా తూకం రాయా?
X
నిర్దిష్టమైన కొన్ని సూత్రాలకు అనుగుణంగా.. ఉండాలని చెప్పడాన్ని ప్రామాణికతగా మనం పరిగణిస్తాం. ఒక దానిని ప్రామాణికంగా పరిగణించిన తర్వాత.. దానికంటె గొప్పగా ఉండడం, తక్కువగా ఉండడాన్ని మాత్రమే మనం లెక్కవేస్తూ ఉంటాం. అంటే తూకం రాయి లాగా అన్నమాట. ఫరెగ్జాంపుల్‌ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదు గొప్ప నగరం అనుకుంటే.. ''అమరావతిని హైదరాబాదుకంటె గొప్ప నగరంగా, విశాఖను హైదరాబాదుకంటే కాస్త తక్కువస్థాయి నగరంగా తీర్చిదిద్దాలి..'' ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరుగుతంది. సింపుల్‌ గా చెప్పాలంటే.. తూకం రాయిలాగా అన్నమాట.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారికి.. దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీ లకు అర్హమైన నగరాలను ఎంపిక చేయడంలో నెల్లూరు నగరం ఒక తూకం రాయిలాగా ఉపయోగపడినట్లుగా ఉన్నది. నెల్లూరు కంటె గొప్ప నగరాలు - నెల్లూరు కంటె తక్కువ నగరాలు అనేది లెక్కలు వేసుకుంటూ.. ఆయన దేశంలో స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేశారా అనిపిస్తోంది.

ఎందుకంటే.. ఏపీలో కీలకమైన ప్రస్తుత రాజధాని నగరం.. విజయవాడను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేయకపోవడం గురించి విలేకరులు అడిగితే.. ఆయన ఆ నగరానికి తన సొంత ఊరు నెల్లూరుతో పోలిక తెస్తూ.. చాలా చిత్రంగా మాట్లాడారు. 'నా సొంతూరు నెల్లూరు నగరాన్నే స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేయలేదు. విజయవాడను ఏవిధంగా ఎంపిక చేస్తాం? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను - ఏపీ మునిసిపల్‌ శాఖ మంత్రి ఇద్దరూ నెల్లూరులోనే ఉన్నాం. అయినా ఆ నగరాన్నే ఎంపిక చేయనప్పుడు ఇక విజయవాడ ఎలా ఎంపిక అవుతుంది?' అంటూ ఆయన విలేకర్లను ఎదురు ప్రశ్నించారు.

గతంలో మీరే విజయవాడలోనే.. ఈ నగరాన్ని స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేస్తానని హామీ ఇచ్చారు కదా అని అడిగినప్పుడు.. ఆయా నగరాల్లో వసూలయ్యే పన్నులు - పౌరసేవలను బట్టి ఎంపిక జరిగిందంటూ ఏదో కబుర్లు చెప్పేప్రయత్నం చేశారు. వెంకయ్యనాయుడు వైఖరి చూస్తే.. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేయడానికి ఆయన నెల్లూరును తూకం రాయిలాగా వాడుకున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా.. కేంద్ర - రాష్ట్ర మంత్రులు ఉండడం అనేది కొలబద్ధ అవుతుందా? స్మార్ట్‌ ఎంపికలు దాన్ని బట్టి జరుగుతాయా? అంటూ జనం నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు వెంకయ్య వద్ద ఏం సమాధానాలు ఉన్నాయో మరి?