Begin typing your search above and press return to search.

ర్యాలీలో వెంక‌య్యకు డేంజ‌ర్ తృటిలో త‌ప్పింది

By:  Tupaki Desk   |   26 Aug 2017 5:27 PM GMT
ర్యాలీలో వెంక‌య్యకు డేంజ‌ర్ తృటిలో త‌ప్పింది
X
ఉప రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తెలుగోడు వెంక‌య్య‌నాయుడుకు ఏపీ స‌ర్కారు ఈ రోజు ఆత్మీయ స‌త్కారం నిర్వ‌హించింది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి 23 కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ల‌క్ష మందితో స్వాగ‌త ఏర్పాట్లు చేయ‌టం తెలిసిందే. వెంక‌య్య మ‌న‌సును దోచుకునేందుకు చంద్ర‌బాబు ప్లాన్ చేసిన గ్రాండ్ వెల్ కం సంద‌ర్భంగా ఒక ప్ర‌మాదం నుంచి తృటిలో ఆయ‌న త‌ప్పించుకున్నారు.

ఉప రాష్ట్రప‌తిగా బాధ్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత తొలిసారి ఏపీకి వ‌స్తున్న సంద‌ర్భంగా అదిరిపోయేలాంటి ఏర్పాట్లు చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఈ ఏర్పాట్ల కార‌ణంగా ప్ర‌జ‌లు ఎంత ఇబ్బంది ప‌డ్డార‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు సాగిన భారీ ర్యాలీని.. ఓపెన్ టాప్ జీపులో నిల‌బ‌డి వెంక‌య్య ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. వెంక‌య్య‌కుకాస్త ప‌క్క‌గా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న‌కు కాస్త వెన‌కగా రెండు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎల్ న‌ర‌సింహ‌న్ నిల‌బ‌డ్డారు.

ఘ‌నంగా వెల్ కం చెప్పే క్ర‌మంలో ఈ భారీ ర్యాలీని డ్రోన్ కెమెరాతో చిత్రీక‌రించేలా ఏర్పాట్లు చేశారు. భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌ల్లో భాగంగా డ్రోన్ కెమెరాతో చిత్రీక‌రించారు. ఇదిలా ఉంటే.. చిత్రీక‌రిస్తున్న డ్రోన్ విజ‌య‌వాడ‌లోని ఏలూరు రోడ్డులోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఒక చెట్టు కొమ్మ‌లో ఇరుక్కుపోయింది.

దీన్ని బ‌య‌ట‌కు తీసేందుకు ఆప‌రేట‌ర్లు ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలో డ్రోన్ కాస్తా కిందకు ప‌డిపోయింది. పై నుంచి కింద‌కు ప‌డిన ఈ డ్రోన్ వెంక‌య్య‌నాయుడి వాహ‌నానికి కాస్త ముందుగా ప‌డింది. వెంక‌య్య‌కు అతి స‌మీపంలోనే డ్రోన్ ప‌డింది. దీంతో.. ప్ర‌ముఖుల‌కు ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పిన‌ట్లైంది. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో భ‌ద్ర‌తాధికారులు అలెర్ట్ అయ్యారు. అయినా.. ఓపెన్ జీపులో ప్ర‌యాణిస్తూ.. ప్ర‌జ‌ల‌కు అభివాదం పెట్టే కార్య‌క్ర‌మం ఉన్న‌ప్పుడు.. ఆ ర్యాలీని క‌వ‌ర్ చేసే డ్రోన్ ఏదైనా సాంకేతిక లోపంతో కిందకు ప‌డిపోయే ప్ర‌మాదాన్ని అధికారులు ఎందుకు గుర్తించ‌న‌ట్లు? అలా జ‌రుగుతుంద‌ని వారు ఊహించ‌లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.