Begin typing your search above and press return to search.

నేను రాష్ట్రప‌తిని కానంటున్న వెంకయ్య‌

By:  Tupaki Desk   |   3 March 2017 3:25 PM GMT
నేను రాష్ట్రప‌తిని కానంటున్న వెంకయ్య‌
X
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండటంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రేసులో ఉన్నారని ఇటీవల విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వెంక‌య్య నాయుడు స్పందించారు. భార‌త‌ రాష్ట్రపతి రేసులో తానున్నట్లు వస్తున్న వార్తలను ఆయ‌న కొట్టిపారేశారు. అవన్నీ ఉత్తి కథనాలే అని తేల్చిపారేశారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో పుకార్లు షికారు చేశాయి. అయితే తాను రాష్ట్రపతి రేసులో లేనని విస్పష్టంగా చెప్పడం ద్వారా ఈ విషయంలో వస్తోన్న పుకార్లకు ఆయన తెరదించిన‌ట్లు అయింది.

కాగా, విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు సమాచారంతో దేశంలో శాంతి, భద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. వెంకయ్యనాయుడు ఆ రెండు పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి - మాజీ మంత్రి పి.చిదంబరంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్, వామపక్షాలు హైజాక్ చేసి శాంతి, భద్రతలను దెబ్బ తీస్తున్నాయని దుయ్యబట్టారు. రాంజాస్ కాలేజీకి బైటివారు వచ్చి జమ్ముకాశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తే దేశాన్ని ప్రేమించే వారు మౌనం వహిస్తారా? అని వెంకయ్య ప్రశ్నించారు. "కాంగ్రెస్, వామపక్షాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. రాంజాస్ కాలేజీ సంఘటనలను రెండు పార్టీలు తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు తమ చదవులు కొనసాగించాలి తప్ప రాజకీయాలు చేయకూడదు. రాజ్యాంగం వారికి ఇచ్చిన వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయరాదు" అని వెంక‌య్య నాయుడు అన్నారు.

వాక్ స్వాతంత్రం అంటే విశ్వవిద్యాలయం వాతావరణాన్ని చెడగొట్టటం కాదని వెంక‌య్య నాయుడు అన్నారు. "జమ్ముకాశ్మీర్‌కు స్వాతంత్రం ఇవ్వాలంటూ దేశాన్ని విభజించాలనుకుంటున్న వారికి కాంగ్రెస్, వామపక్షాలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తున్నాయి, దేశ ద్రోహులను సమర్థించటం దేశద్రోహం కాదా? "అని ఆయన నిలదీశారు. కాశ్మీర్ ఆజాదీ గురించి మాట్లాడే వారు ముస్లిం మహిళల ఆజాదీ గురించి ఎందుకు పోరాడటం లేదని వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌గురును సమర్థించే ఉమర్ ఖలీద్‌కు మద్దతు ఇచ్చే వారు దేశ ద్రోహులు కాదా? అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కొంతకాలం జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా జరిగిన సమావేశాలకు రాహుల్ గాంధీ, డి.రాజా, సీతారాం ఏచూరి తదితర నాయకులు ఎందుకు వెళ్లారు? వీరు అక్కడికి వెళ్లటం విద్యార్థులను రెచ్చగొట్టటం కాదా?’ అని వెంకయ్యనాయుడు నిలదీశారు. నేతలు వెళ్లినప్పుడే అక్కడ గొడవలు జరిగాయని, ఆ తరువాత అంతా సద్దుమణిగిపోయిందనేది గ్రహించాలన్నారు.

జేఎన్‌యూ గురించి కూడా ఇప్పుడు ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదని వెంక‌య్య‌నాయుడు ప్ర‌శ్నించారు. ఫొటో అవకాశం ఉన్న ప్రతి చోటికి రాహుల్ గాంధీ వెళతారంటూ ఆయన వ్యంగ్య బాణాలు విసిరారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో బిజెవైఎం విద్యార్థులు గొడవ చేయటం గురించి మాట్లాడుతూ బిజెవైఎంతో పాటు ఏ విద్యార్థి సంస్థ కూడా హింసకు పాల్పడకూడదన్నారు. అసమ్మతిని అంగీకరిస్తాం కానీ దేశ విభజనను ఎటువంటి పరిస్థితిలో ఆమోదించటం జరగదని వెంకయ్య స్పష్టం చేశారు. కాశ్మీర్ దాదాపుగా పోయినట్లే అని వ్యాఖ్యానించిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని వెంకయ్యనాయుడు తీవ్రంగా తప్పు పట్టారు. మన పొరుగుదేశం మన దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతుంటే మన నాయకులు ఈ విధంగా వ్యవహరించటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/