Begin typing your search above and press return to search.

ప్రసవ వేదన ఇన్నాళ్లైతే చచ్చిపోరా వెంకయ్యా?

By:  Tupaki Desk   |   19 Nov 2016 4:16 AM GMT
ప్రసవ వేదన ఇన్నాళ్లైతే చచ్చిపోరా వెంకయ్యా?
X
కొన్నిసార్లు ఉపమానాలు ఎంతగా అక్కరకు వస్తాయో.. మరికొన్నిసార్లు అంతగా ఇబ్బంది పెడతాయి. లేనిపోని చిక్కుల్లో పడేస్తాయి. అందుకే..సమయం సందర్భం చూసుకోకుండా ఉపమానాల్ని ఉపయోగిస్తే ఉన్న పరువు కూడా పోయే పరిస్థితి. తాజా ఉదంతంలో కేంద్రమంత్రి వెంకయ్య పరిస్థితి ఇలానే ఉంది. అంత్యప్రాసలతో పదాల్ని ఆటాడేసుకుంటూనే.. నాన్ స్టాప్ గా మాట్లాడేసే ఆయన.. తాజాగా నోట్లరద్దు.. దాని కారణంగా వచ్చి పడ్డ ఇబ్బందుల మీద మాట్లాడారు. రద్దు కారణంగా మంచి ఎంతైనా జరగని.. చెడు మాత్రం జరగకూడదు. ఆ నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు తాత్కాలికం అయినా.. ఆ తాత్కాలికం ఎన్నాళ్లు? ఎన్ని వారాలన్న విషయంలో అయినా ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుండేది.

నోట్ల రద్దు వ్యవహారం ముగిసి.. రెండో వారంలోకి అడుగుపెడుతున్న వేళ.. ఈ రోజుకీ ఏటీఎం సెంటర్లు ‘‘ఎనీ టైం మూతే’’ అన్న చందంగా ఉన్నాయి. ఇక.. బ్యాంకు దగ్గర క్యూ లైన్ల బార్లు తగ్గని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఒకపక్క.. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ అయి ఉన్నా.. చేతికి మాత్రం చిల్లర పైసలు వస్తున్న వేళ.. జనాలు తీవ్ర అసంతృప్తితో.. ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. సగటు జీవికి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని వీలైనంత త్వరగా ప్రభుత్వం ఎలాంటి చర్యల్ని చేపట్టిందన్న అంశాల్ని చెప్పకుండా.. ఆ మాత్రం ఇబ్బందుల్ని ఫేస్ చేయలేరా? అన్నట్లుగా మాట్లాడటం చూసినప్పుడు ఒళ్లు మండి పోతుంది.

నీతులు చెప్పే నేతలు.. సామాన్యుల కష్టాల్ని ఉపమానాలతో తేల్చేసే పెద్ద మనుషులు.. వారి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా క్యూలో నిలుచొని సామాన్యుడు పడే కష్టాలు పడరన్న విషయాన్ని మర్చిపోకూడదు. నోట్ల రద్దుతో సామాన్యుడి ఎదురవుతున్న కష్టాల్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివని వ్యాఖ్యానించారు. ప్రాధమికంగా కొన్ని ఇబ్బందులున్నా భవిష్యతులో ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు.

వెంకయ్య మాటలు వినగానే కలిగే భావన ఏమిటంటే.. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో వచ్చి పడిన ఇబ్బందులన్నీ ప్రసవ వేదనే అయితే.. పురిటి నొప్పులు మహా అయితే ఒక రోజో.. రెండు రోజులో (అసాధారణ పరిస్థితుల్లోనే) అయితే ఓకే కానీ.. ఇలా పదేసి రోజుల పాటైతే.. చచ్చి ఊరుకుంటారు. ప్రసవ వేదన పదం వాడినంత ఈజీగా దాని బాధ ఉండదన్న విషయాన్ని వెంకయ్య మర్చిపోకూడదు. ఒకవేళ.. ఆయనకు ఈ పదానికున్న ‘వేదన’ ఎంతన్నది తెలియాలంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్లను అడిగితే..ఈ పదాన్ని ప్రయోగించరు. పుట్టేది ఎవరో తెలీనప్పుడు.. అసలు గర్భమే అక్కర్లేదని ఫీలయ్యే వారికైతే వెంకయ్య మాటలు ఒళ్లు మండిపోయేలా చేస్తుందనటంలో సందేహం లేదు. జనాలు కాక మీద ఉన్నప్పుడు ఇలాంటి ఉపమానాలు మరింత మండిపోయేలా చేస్తాయన్నవిషయాన్ని కేంద్రమంత్రి వర్యులు గమనిస్తే బాగుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/