Begin typing your search above and press return to search.

కక్షపై ఇప్పుడా మాట్లాడేది వెంకయ్య?

By:  Tupaki Desk   |   20 Dec 2015 10:10 AM GMT
కక్షపై ఇప్పుడా మాట్లాడేది వెంకయ్య?
X
కొన్ని తప్పులు అస్సలు జరగకూదు. ఒకవేళ జరిగినా.. కనురెప్ప పాటులో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది మోడీ సర్కారు. తనకు సంబంధం ఉందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని బలంగా తిప్పికొట్టే బీజేపీ నేతలే కనిపించని దుస్థితి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఆమె కుమారుడి మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ.. ఆమెను కోర్టు గుమ్మం ఎక్కించారంటూ కాంగ్రెస్ సహా.. మిగిలిన రాజకీయ పార్టీలు విరుచుకుపడుతుంటే.. ఈ విషయం మీద బీజేపీ మిత్రపక్షాల సంగతి తర్వాత.. బీజేపీ సైతం రియాక్ట్ కాని పరిస్థితి.

ఈ సందర్భంలో తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. తమ ప్రభుత్వం గాంధీ కుటుంబం మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించటం లేదని వ్యాఖ్యానించారు. అసలు ఆ అవసరం తమకు లేదని చెప్పిన వెంకయ్య.. నేషనల్ హెరాల్డ్ కేసుతో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ పరపతిని దెబ్బ తీసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. బెయిల్ ఇస్తే సంబరాలు ఎందుకంటూ వెంకయ్య ప్రశ్నించారు.

కోర్టు గుమ్మం తొక్కటానికి కారణం మోడీనే అని పూర్తిగా నమ్మినప్పుడు.. తమ అధినేత్రికి అనుకూలంగా బెయిల్ వస్తే కాంగ్రెస్నేతలు సంబరాలు చేసుకోకుండా ఉంటారా? ఈ చిన్న విషయం వెంకయ్యకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇక.. కాంగ్రెస్ అధినేత్రిపై మోడీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు భారీగా వినిపిస్తున్నా.. వాటిని ఖండించేందుకు.. ధీటుగా బదులిచ్చే విషయంలో బీజేపీ నేతలు ఎందుకు వెనుకపడిపోతున్నట్లు..? ఈ విషయం మీద వెంకయ్య అండ్ కో దృష్టి పెడితే బాగుండు.