Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ నుంచి వచ్చాక డ్రెస్ మారలేదేంటి?

By:  Tupaki Desk   |   8 Oct 2015 9:16 AM GMT
ఫ్రాన్స్ నుంచి వచ్చాక డ్రెస్ మారలేదేంటి?
X
ఎక్కడ ఎలా ఉండాలో మన నేతలకు బాగానే తెలుసు. దేశంలో ఉన్నప్పుడు దేశీయంగా ఉంటూ.. విదేశాల్లో అడుగు పెట్టిన వెంటనే రూపురేఖల్ని పూర్తిగా మార్చేసే రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు. అప్పుడెప్పుడో జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి నేతలు ఇప్పటి రోజుల్లో పెద్దగా కనిపించరు. ఆయన స్వదేశంలో ఉన్నా.. విదేశంలో ఉన్నా ఒకే రకంగా వ్యవహరించే వారు.

నిజానికి ఆయన వస్త్ర ధారణ చూసి.. విదేశాల్లోని పలువురు ఆశ్చర్యపోయినా.. ఆయన మాత్రం అస్సలు పట్టించుకునే వారు కాదు. కానీ.. ఇప్పటి నేతలు అందుకు భిన్నం. దివంగత నేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వ్యవహారమే తీసుకోండి. తెలుగు నేల మీద ఉన్నప్పుడు అచ్చ తెలుగు వ్యక్తిలా కనిపించే ఆయన.. ఒక్కసారి విమానం ఎక్కి.. విదేశాల్లో దిగారంటే చాలు.. వైఎస్ ను పోల్చుకోవాలంటే కష్టంగా ఉండేది. అవుట్ అండ్ అవుట్ ఛేంజ్ అయిపోయేవారు.

ఇప్పుడు అలానే వ్యవహరిస్తారు కేంద్రమంత్రి వెంకయ్య. దేశంలో ఉన్నప్పుడు ఆయన సంప్రదాయ దుస్తుల్ని ధరిస్తుంటారు. తెల్లటి పంచె.. అదే రంగు చొక్కా ధరిస్తూ.. సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా కనిపిస్తారు. అలాంటి ఆయన విదేశాలకు వెళితే మాత్రం లుక్ మార్చేస్తారు.

ఈ మధ్యనే ఫ్రాన్స్ వెళ్లిన ఆయన సూటుబూటుతో అలరించారు. ఆసక్తికరంగా తాజాగా ఢిల్లీలో జరిగిన సదస్సులో పాలగొన్న ఆయన.. తన సహజ వేషధారణకు భిన్నంగా సూటుబూటు ధరించి ఆశ్చర్యపర్చారు. ఫారిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈసారి వెంకయ్య డ్రెస్ మారకపోవటం కాస్త చిత్రమైన వ్యవహారమే. కాకుంటే ఫ్రాన్స్ లో టై కట్టుకున్న ఆయన.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన వెంకయ్య టై లేకుండా సూటు..బూటుతో కనిపించారు.