Begin typing your search above and press return to search.

టీడీపీ క‌ళ్లల్లో ఆనందం చూడ‌ట‌మే ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   11 March 2017 3:44 AM GMT
టీడీపీ క‌ళ్లల్లో ఆనందం చూడ‌ట‌మే ల‌క్ష్యం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే విష‌యంలో కేంద్ర సమాచార - పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడు వ్య‌వ‌హార‌శైలి ఆస‌క్తిక‌రంగా మారుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు నెర‌వేర్చేందుకు తెలుగు ఎంపీగా కృషిచేయాల్సిన వెంక‌య్య దాన్ని ప‌క్క‌న పెడుతున్నార‌ని కొన్ని వ‌ర్గాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే ఇన్నాళ్లు రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో ఒకింత స్త‌బ్దుగా ఉన్న వెంక‌య్య తాజాగా టీడీపీ వ‌ల్ల దూకుడు పెంచారు. ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాకు బదులుగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రత్యేక రైల్వే జోన్‌ - నియోజకవర్గాల పునర్విభజన - రెవిన్యూ భర్తీ వంటి విభజన హామీలను సత్వరమే అమలు చేయాలని కోరుతూ కేంద్రంపై వత్తిడి పెంచాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించుకోవడంతో వెంకయ్యనాయుడు మరోసారి రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్లమెంట్‌ సభ్యులతో పాటు వివిధ శాఖలను నిర్వహిస్తున్న తన మంత్రివర్గ సహచరులు పలువురిని విడివిడిగా పార్లమెంట్‌ ప్రాంగణంలోని తన కార్యాలయానికి ఆహ్వానించి ఆయా శాఖల వారీగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పథకాలు - పథకాల అమలు తీరును సమీక్షించారు. కేంద్ర మంత్రులు పి.అశోక్‌ గజపతిరాజు - సుజనా చౌదరి - దాదాపు డజను మంది టీడీపీ పార్లమెంట్‌ సభ్యులను కూర్చోబెట్టుకొని మ‌రి ఈ చ‌ర్చ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రం.

స‌ద‌రు కేంద్ర మంత్రుల‌తో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఇప్పటికే ఆమోదించిన పథకాలు - ఏర్పాటు చేసిన సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తగినన్ని నిధులు విడుదల చేయాలని, ఇంకా పెండింగ్‌ లో ఉన్న అంశాలను సత్వరమే పరిష్కరించి అమలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంక‌య్య నాయుడు కోరారు. వెంకయ్యనాయుడు ఆహ్వానంపై ఆయన కార్యాలయానికి వచ్చి టీడీపీ నాయకులతో విభజన హామీల అమలు తీరును చర్చించిన కేంద్ర మంత్రులలో హోం మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ - రక్షణ మంత్రి మనోహర్‌ పారిక్కర్‌ - రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు - మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ - ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా - న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ - జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ - వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ - జలవనరుల శాఖ మంత్రి కుమారి ఉమాభారతి - గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ - వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ - సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ - విద్యుత్‌ శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ - చిన్న పరిశ్రమల మంత్రి కల్‌ రాజ్‌ మిశ్రా - టూరిజం శాఖ మంత్రి మహేష్‌ శర్మ ఉన్నారు. వీరితో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు - మరికొన్ని ఇతర శాఖలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు.

కాగా, విభజన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలన్న వెంకయ్య నాయుడు అభ్యర్థనకు ఎక్కువ మంది కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉన్న భూసేకరణ వంటి సమస్యలు పరిష్కారమైతే తదనంతర చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరికొందరు వివరించారని తెలియవచ్చింది. ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం, రెవిన్యూ లోటును భర్తీ చేసే అంశాలు మినహా మిగిలిన అన్ని అంశాలు దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ చర్చలలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విభజన చట్టంలో పేర్కొన్న ట్లుగా ఏపీ - తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా పార్లమెంట్‌ లో ఒక బిల్లును ప్రవేశపెట్టే విషయమై కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం ఒక నోట్‌ను సిద్ధం చేసే కార్యక్రమం జరుగు తోందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి సమాచార మంత్రికి తెలియజేసినట్లు వెంకయ్యనాయుడు కార్యాలయం ఆ తర్వాత వెల్లడించింది. ఈ విషయమై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తో కూడా ఆయన మాట్లాడినట్లు వివరించింది.

విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ను ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్న సమాధానమే మరోసారి రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు నుండి లభించింది. నడికూడి-శ్రీకాళహస్తి రైలుమార్గం వంటి పెండింగ్‌ లో ఉన్న వివిధ రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉన్న సెంట్రల్‌ యూనివర్శీటీ - గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం నోట్‌ తయారు చేస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి తెలియజేశారు. వీటితో పాటు ఏపీలో రెన్యూవబుల్‌ ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సంబంధిత మంత్రికి సూచించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ప్రతిపాదిత రహదారుల నిర్మాణ ప్రతిపాదనల ఆమోదాన్ని వేగవంతం చేయాలన్న సూచనకు అంగీకరించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాష్ట్రానికి రు.50కోట్లు అదనంగా మంజూరు చేసేందుకు అంగీకరించారని కేంద్ర మంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఇలా ఏపీకి న్యాయ‌బ‌ద్దంగా ద‌క్కాల్సిన అన్ని అంశాల‌పై స‌రైన నిర్ణ‌యం తీసుకునే దిశగా వెంక‌య్య నాయుడు అడుగులు ప‌డ్డాయి. అయితే ఇదే చొర‌వ‌, వేగం ముందు చూపించి ఉండాల్సింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట‌రీ స‌మావేశం నిర్వ‌హించుకున్న త‌ర్వాతే ఈ స‌మావేశం జ‌ర‌ప‌డం ఆస‌క్తిగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/