Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై వెంకయ్య పరోక్ష సెటైర్లు

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:30 PM GMT
చంద్రబాబుపై వెంకయ్య పరోక్ష సెటైర్లు
X
చంద్రబాబు తానా అంటే తందానా అనే నేత ఎవరైనా ఉన్నారంటే అది వెంకయ్యనాయుడే. కానీ, అలాంటి వెంకయ్యనాయుడు ఇటీవల చంద్రబాబుకు ఏమాత్రం రుచించని డైలాగులు చెబుతున్నారు. పొరపాటున మనసులోని బయటపెట్టేస్తుండడంతో వెంయక్య చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినట్లవుతోంది. తాజాగా ఆయన మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుపతి పీఎల్‌ ఆర్‌ గార్డెన్స్‌ లో జరిగిన సభలో పాల్గొన్న వెంకయ్య రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయం గురించి చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే సభావేదికపై వెంకయ్యనాయుడు వెనుక కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చి నిల్చున్నారు. అది చూసిన వెంకయ్యనాయుడు వెంటనే వారిని అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పారు. తన వెనుక ఎవరూ నుల్చోవద్దని కోరారు. అక్కడితో ఆగారా... 1984 ఆగస్టులో ఎన్టీఆర్‌ కు ఏం జరిగిందో తెలుసు కదా!. అందుకే నేనూ వెనుక ఎవరు నుంచున్నా భయపడతాను అని అన్నారు.

దాంతో సభలో టీడీపీని వ్యతిరేకించే బీజేపీ నేతలంతా ఒక్కపెట్టున హర్షద్వానాలు చేశారు. వెంకయ్యనాయుడు పరోక్షంగా నాదెండ్ల భాస్కరరావును గురించి చెప్పినా లేదంటే చంద్రబాబు గురించి చెప్పినా కూడా వెన్నుపోటు అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది మాత్రం చంద్రబాబు పేరే కాబట్టి వెంకయ్య కామెంట్లు వైరల్ గా మారిపోయాయి.

మరోవైపు కొద్దిరోజులు పాడుతున్న పాటనే వెంకయ్య ఇక్కడా పాడారు. చట్టంలో చెప్పిన అనేక సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ కు ఇచ్చామని చెప్పారు . దశాబ్దాలుగా ఏపీకి ఏమీ చేయని కాంగ్రెస్‌ వాళ్లు రెండున్నరేళ్లలోనే బీజేపీ ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాను కర్ణాటక నుంచి గెలిచినప్పటికీ తెలుగువాడిగా విభజన సమయంలో ఏపీ తరపున మాట్లాడానని చెప్పారు. అయినప్పటికీ తనను విమర్శిస్తున్నారని కానీ వాటిని తాను పట్టించుకోనన్నారు. ఇదంతా ఎలా ఉన్నా వెన్నుపోటు గురించి వెంకయ్య ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో హైలైటుగా మారింది. అయితే... భద్రతా కారణాల వల్లే వెంకయ్య వారిని అక్కడ నిల్చోనివ్వకపోయుంటారని భావిస్తున్నారు. కానీ, చతురుడైన ఆయన అలా చెప్పకుండా ఎన్టీఆర్ వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించి దానికి రాజకీయం జోడించారు.