Begin typing your search above and press return to search.

'డ్రంకెన్ డ్రైవ్' ఎంపీకి వెంకయ్య రాచమర్యాదలు

By:  Tupaki Desk   |   17 Feb 2016 8:10 AM GMT
డ్రంకెన్ డ్రైవ్ ఎంపీకి వెంకయ్య రాచమర్యాదలు
X
మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు రాజమండ్రిలో కారు యాక్సిడెంట్ చేశారు. ఆ సమయంలో ఆయన తాగి కారు నడుపుతుండడంతో కేసు బిగుసుకునే ప్రమాదాన్ని శంకించారు.... వెంటనే ఆయన తమ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడుకు ఫోన్ చేయడం... ఆయన వ్యవహారాన్ని చక్కబెట్టేయడం జరిగిపోయాయి.

మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ డాక్టర్ చందనమిత్రా రాజమండ్రి మీదుగా వెళ్తూ యాక్సిడెంట్ చేశారు. ఆయన నడుపుతున్న ల్యాండ్ రోవర్ కారు అదుపు తప్పి, ముందు వెళుతున్న మరో కారును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వీఆర్వో దాపర్తి రాజేశ్వరరావు, ఆయన భార్య విశాలాక్షి గాయపడ్డారు.

హుకుంపేట వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో చందన్ మిత్రా తాగి ఉన్నారని... అందుకే వాహనం అదుపుతప్పి డివైడర్ ఎక్కి అనంతరం ముందున్న కారును ఢీకొందని అక్కడున్నవారు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్వరరావు, విశాలాక్షిలు గాయపడ్డంతో వారు ఎంపీ మిత్రా కారును అడ్డుకుని బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారుతోపాటు ఎంపీమిత్రా దంపతులు, కారు డ్రైవర్‌ ను స్టేషన్‌ కు తరలించారు. తన కారును ఢీకొన్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజేశ్వరరావు ఫిర్యాదు చేశారు. మిత్రాయే కారు డ్రైవ్ చేస్తున్నారని, మద్యం మత్తులో ఉన్నారని, సీసీ ఫుటేజీలను పరిశీలించాలని కోరారు.

దీంతో మిత్రా వెంటనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ఫోన్ చేశారు. వెంకయ్యతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు పరకాల ప్రభాకర్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో తూర్పుమండల డీఎస్పీ సౌమ్యలత పోలీస్ స్టేషన్‌ కు చేరుకుని బాధితునికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మిత్రా డ్రైవ్ చేయలేదంటూ... కారు డ్రైవర్ ఉమేశ్ పై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి, కారుకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌ స్పెక్టర్‌ తో బ్రేక్ (తనిఖీ) చేయించి.. కారు సహా మిత్రా దంపతులను, వారి డ్రైవర్ ను సాగనంపారు. మొత్తానికి తాగి వాహనం నడిపిన ఎంపీని వెంకయ్యనాయుడు బాగానే సేవ్ చేశారు.