Begin typing your search above and press return to search.

తాను చేయనిది చెబుతున్న వెంకయ్యనాయుడు

By:  Tupaki Desk   |   25 April 2022 11:30 AM GMT
తాను చేయనిది చెబుతున్న వెంకయ్యనాయుడు
X
పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇపుడు నీతులు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగుళూరు ప్రెస్ క్లబ్ ఏర్పడి 50 ఏళ్ళయిన సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ మారాలని అనుకుంటే ముందు తమ పదవులకు రాజీనామాలు చేయాలని చెప్పారు.

పార్టీ ఫిరాయింపుల చట్టం రీటైల్ ఫిరాయింపులను అడ్డుకుంటున్నప్పటికీ హోల్ సేల్ ఫిరాయింపులను మాత్రం అడ్డుకోలేకపోతున్నట్లు తెగ బాధపడిపోయాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించారు. బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీలు పార్టీలో చేరినట్లు ఇదే వెంకయ్య సాయంత్రానికల్లా గెజెట్ నోటిఫికేషన్ జారీచేశారు.

ఇపుడు నీతులు చెప్పిన వెంకయ్య మరపుడు వాళ్ళ పదవులకు రాజీనామాలు చేయాలని వెంకయ్య ఎందుకు చెప్పలేదో ? రాజీనామాలు చేయకుండా బీజేపీలోకి చేర్చుకునేది లేదని చెప్పుండచ్చుకదా.

పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగులున్నాయని వాటిని సరిదిద్దాలన్నారు. ఫిరాయింపుల చట్టంలో లొసుగులున్నాయని చెప్పిన వెంకయ్య వాటిని సరి చేయటానికి ఎప్పుడైనా ప్రయత్నించారా ? పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినపుడు కూడా వెంకయ్య ఈ ప్రయత్నం చేసినట్లు లేదు.

రాజ్యసభ చైర్మన్ హోదాలో ఇప్పుడైనా వెంకయ్య ఆ ప్రయత్నం చేయచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నం చేసినట్లు ఎక్కడా వినలేదు. అధికార స్థానాల్లో ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు చట్టసభల్లో ఆ పని చేయకుండా బయటకు వచ్చి ఎన్నిమాటలు చెప్పినా ఉపయోగం ఉండదు. ఫిరాయింపులపై 3 నెలల్లోనే తేల్చేయాలని చెప్పటం వరకు బాగానే ఉంది.

అయితే ఆ దిశగా ఒక చట్టం తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయటం లేదన్నదే ప్రశ్న. బీజేపీ అగ్ర నేతల్లో ఒకరయ్యుండి, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో కేవలం మాటలు చెబితే ఉపయోగం ఏముంటుంది ? చెప్పే మాటలేవో క్రియా రూపంలో చూపితేనే జనాలు సంతోషిస్తారు.