Begin typing your search above and press return to search.

వెన‌క‌డుగు వేయ‌డం మోడీ ర‌క్తంలోనే లేదు

By:  Tupaki Desk   |   24 Nov 2016 6:43 AM GMT
వెన‌క‌డుగు వేయ‌డం మోడీ ర‌క్తంలోనే లేదు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీరును కేంద్ర సమాచార - ప్రసారాలశాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు మ‌రోమారు త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. విధాన నిర్ణయాల అమలులో వెనుకడుగు వేయడం ప్రధాని నరేంద్రమోడీ రక్తంలోనే లేదని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దనోట్ల రద్దును ప్రభుత్వం ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ దేహాత్ కిసాన్ మజ్దూర్ ఆధ్వర్యంలో జరిగిన మహా పంచాయతీలో వెంక‌య్య మాట్లాడుతూ ఈ మేర‌కు క‌రాఖండీగా పెద్ద నోట్ల ర‌ద్దుపై క్లారిటీ ఇచ్చేశారు. నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ - ఆమ్‌ ఆద్మీ పార్టీ తదితర విప‌క్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో నెల‌కొన్న‌ ప్రస్తుత పరిస్థితులను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంక‌య్య నాయుడు అన్నారు.ఈ విష‌యంలో విపక్షాలు ప్రభుత్వానికి తగు సూచనలివ్వాలని కోరారు. నోట్ల ర‌ద్దుపై ప్రభుత్వం పార్లమెంట్‌ లో చర్చకు సిద్ధంగా ఉన్నా విపక్షాలు గందరగోళం సృష్టిస్తూ పారిపోతున్నాయని ఎద్దేవాచేశారు. యురీ ఘటనలో అమరవీరులను, నోట్లరద్దుతో మృతి చెందిన వారితో సరిపోలుస్తున్నారని వెంకయ్య విపక్షాలపై మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటే కాకుండా చాలా దురదృష్టకరమని వెంక‌య్య అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసున‌ని పేర్కొంటూ అకస్మాత్తుగా చెలామణిలో ఉన్న రూ.16 లక్షల కోట్ల కరెన్సీ స్థానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అంత తేలిక కాదని వెంక‌య్య అన్నారు. నోట్ల ముద్రణకు సమయం పడుతుందని, దేశ అభ్యున్నతికి తీసుకున్న ఈ నిర్ణయం అమలులో మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. కాగా మహా పంచాయతీకి హాజరైన రైతు నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/