Begin typing your search above and press return to search.

'హోదా' ఇష్యూను చుట్ట చుట్టిసిన వెంకయ్య

By:  Tupaki Desk   |   8 Nov 2016 3:01 AM GMT
హోదా ఇష్యూను చుట్ట చుట్టిసిన వెంకయ్య
X
ప్రత్యేక హోదా సాధించటమే తమ లక్ష్యంగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో లక్షలాది సాక్షిగా చెబితే.. అది జరిగిన 24 గంటలు కూడా కాక ముందే.. హోదా అంశంపై స్పందించటమే కాదు.. కీలకవ్యాఖ్య చేశారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏపీకి హోదా సాధన కోసం ఎంతకైనా రెఢీ.. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ఓపక్క చెబుతుంటే.. మరోపక్క అలాంటి మాటల్ని తాము అస్సలు పట్టించుకోమన్న రీతిలో వెంకయ్యనాయుడు మాటలు ఉండటం గమనార్హం.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసే వారు.. విమర్శలు చేస్తున్న వారు రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజిస్తున్న సమయంలో ఏం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వెంకయ్య. హోదా గురించి మాట్లాడే ముందు.. రాష్ట్ర విభజనపై తాను వేసిన ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుంటుందంటున్నారు. ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాను కలిసి మోసం చేస్తున్నామని చెప్పే వారంతా.. ఏపీకి పచ్చి మోసం జరిగే సమయంలో ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని స్పష్టం చేసిన వెంకయ్య.. ‘‘ఒక్కటైనా హామీ నెరవేర్చారా అని అంటున్నారు. ఐఐటీ.. ఐఐఎం లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏర్పడిన విషయాన్ని మర్చిపోతున్నారు. అలాంటివి చూసే వారికి మాత్రమే కనిపిస్తాయి. వినే వారికే వినబడతాయి. కానీ.. ఏమీ చూడం.. ఏమీ వినమనే వారంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని ఏమీ చేయలేం’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. ఓపక్క ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని.. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏది ఏమైనా హోదా సాధించి తీరుతామని తేల్చి చెబుతూ.. ఉద్యమగోదాలోకి అడుగుపెడుతున్న వేళ.. అందుకు భిన్నంగా వెంకయ్య మాత్రం ఏపీ ప్రత్యేక హోదా ఇష్యూనే క్లోజ్ అయిపోయిందన్న విషయాన్ని తేల్చి చెప్పటం విశేషంగా చెప్పకతప్పదు.