Begin typing your search above and press return to search.

స‌న్మాన స‌భ‌లో వెంకయ్య విభ‌జ‌న ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   26 Aug 2017 10:06 AM GMT
స‌న్మాన స‌భ‌లో వెంకయ్య విభ‌జ‌న ఆవేద‌న‌
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఇటీవ‌లే ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేంద్ర మాజీ మంత్రి వెంక‌య్య‌నాయుడు త‌న ఆత్మీయ స‌న్మాన స‌భ‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉప రాష్ట్రప‌తిగా ఎంపిక‌యిన సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు నిర్వ‌హించిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో అనేక అంశాల‌పై మాట్లాడిన వెంక‌య్యనాయుడు ఈ సంద‌ర్భంగా విభ‌జ‌న అంశాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవమ‌ని ఆయ‌న అంగీక‌రించారు. అందుకే రాష్ట్ర విభజన సందర్భంగా తాను చాలా మధనపడ్డానని తెలిపారు.

తాను ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాలేదని అయితే...ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన తాను దేశంలోని ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరిగితే అంగీకరించకూడదన్న నిర్ణయానికి వచ్చి నాడు రాజ్యసభలో గళమెత్తానని వెంక‌య్య‌నాయుడు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు త‌న వంతు శాయశక్తులా ప్రయత్నం చేశానన్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర విద్యాసంస్థలు - పరిశ్రమలు రావడానికి తన వంతు కృషి చేశానని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం తన హక్కులను సాధించుకోవడానికి ప్రయత్నించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మీద ఉందన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ కే మంత్రా అని ఎద్దేవా చేశారన్నారు. ప్రధాని మోడీ కూడా ఒకసారి సరదాగా ఏపీకి ఇబ్బందేముంది వెంకయ్యనాయుడు ఉన్నారు, మా గుజరాత్ కు ఎవరున్నారని వ్యాఖ్యానించారని వెంకయ్యనాయుడు చెప్పారు.

ఉపరాష్ట్రపతిగా ఉన్నా తెలుగు రాష్ట్రాలకూ - తెలుగు ప్రజలకూ సాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తనకు జరిగిన పౌరసన్మానానికి కృతజ్ణతలు తెలిపిన ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి చెందాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తరచూ కలిసి మాట్లాడుకుంటూ ఉండాలని సూచించానని, అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులూ అంగీకరించారని వెంకయ్యనాయుడు చెప్పారు. స్వతంత్ర్య భారత దేశంగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం అని వెంకయ్యనాయుడు అన్నారు. దేశం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా అవినీతి, అరాచకం, అసమానతలు రాజ్యమేలుతున్నాయని, అవి లేని సమాజం కావాలన్నారు. ఎవరికీ చేయి కలపకుండా, చేయి తడపకుండా పనులు జరిగే పరిస్థితి రావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా, నేను భారతీయుడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలని వెంకయ్య‌ నాయుడు ఆకాంక్షించారు.

గ్రామ రాజ్యం లేని రామరాజ్యం అసంపూర్ణమని మహాత్మాగాంధీ చెప్పారని వెంకయ్య అన్నారు. తాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాననీ, ఆ తరువాత నిన్న మొన్నటి వరకూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసి రిటైర్ అయ్యానని చెప్పారు. ఈ రెండు శాఖల విషయంలో తనకు చాలా సంతృప్తిగా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు రోడ్లు పథకానికి గ్రామీణ రోడ్ల అనుసంధానం కార్యక్రమానికి కేంద్ర మంత్రిగా తాను శ్రీకారం చుట్టానని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమానికి తన హయాంలోనే అంకురార్పణ చేయడం తన అదృష్టమని వెంకయ్యనాయుడు చెప్పారు. చట్టసభల గౌరవం ఇనుమడింపచేసేలా చట్ట సభల సభ్యులు వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీల తేడాలతో సంబంధం లేకుండా సభ్యులందరూ సభలో అర్ధవంతమైన చర్చలకు అవకాశం ఉండేలా వ్యవహరించాలన్నారు. వేరువేరు పార్టీల సభ్యులు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదించాలని, విపక్షం దానికి వ్యతిరేకించవచ్చు అయితే సభలో దానికి డిస్పోజ్ చేయాలని అన్నారు. గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే, విపక్షం అపోజ్ చేస్తే సభ డిస్పోజ్ చేయాలని వెంకయ్య అన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యసభ సమవేశాలు జరిగేలా తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.

కాగా, భారత ఉపరాష్ట్రపతి బాధ్య‌త‌లు స్వీకరించిన వెంకయ్యనాయుడుకు పౌర‌స‌న్మానంలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా, సీఎం చంద్ర‌బాబు - గవర్నర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజి వరకూ 23 కిలోమీటర్ల మేర లక్ష మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు.