Begin typing your search above and press return to search.

మరో గంద‌ర‌గోళానికి వెంక‌య్య తెర తీశారే!

By:  Tupaki Desk   |   22 March 2017 6:22 AM GMT
మరో గంద‌ర‌గోళానికి వెంక‌య్య  తెర తీశారే!
X
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌పై బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు మ‌రోమారు గంద‌ర‌గోళానికి తెర తీశారు. ఓ వైపు 2026 దాకా సీట్ల సంఖ్య పెంపు కుద‌ర‌ద‌ని సంబంధిత శాఖ స‌హాయ మంత్రి పార్ల‌మెంటు సాక్షిగా న‌ర్మ‌గ‌ర్భంగా ప్ర‌క‌ట‌న చేస్తే... ఆ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన వెంక‌య్య‌... ఆరు నూరైనా, నూరు ఆరైనా కూడా... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగి తీరుతుంద‌ని వెంక‌య్య సెల‌విచ్చారు. ఈ దిశ‌గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోట్ త‌యారు చేస్తోంద‌ని కూడా నిన్న ఢిల్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ తో భేటీ అయిన త‌ర్వాత రాజ్ నాథ్ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా వెంక‌య్య ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అయినా... అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపున‌కు సంబంధించిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త కేంద్ర హోం మంత్రిత్వ శాఖదే. వెంక‌య్యకు ఆ శాఖ వ్య‌వ‌హారాల‌తో ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఏ ప‌ని ఉన్నా,.. ఆ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్‌ తోనే వెంక‌య్య మాట్లాడుతున్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి వెంక‌య్య వాద‌నకు ఒక్కోసారి సానుకూలంగా స్పందిస్తున్న రాజ్ నాథ్... మ‌రికొన్ని సార్లు మాత్రం అస‌లు వెంక‌య్య కోరిన మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం సాధ్యం కాద‌ని కూడా ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వెంక‌య్య ఏపీ త‌ర‌ఫున నెర‌పిన మంత్రాంగం సంద‌ర్భంగా రాజ్ నాథ్ స‌సేమిరా అన్న‌ వైనం మ‌నం చూసిందే.

అయితే నిన్న‌టి ప‌రిణామాలను ఓ సారి ప‌రిశీలిస్తే... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల‌ను పెంచే విష‌యంలో తెలుగు ఎంపీలు చాలా ఆస‌క్తిగా ఉన్నారు. ప‌లు ద‌ఫాలుగా వారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌ను సంప్ర‌దిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో తెలుగు ఎంపీలు ఈ విష‌యంపై సంధించిన ఓ ప్ర‌శ్న నిన్న లోక్ స‌భ ముందుకు రాగా... 2026 వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... ఏ ఒక్క రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్ల‌ను పెంచే అవ‌కాశాలు లేవ‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి హోదాలో హ‌న్స్‌ రామ్ గంగారామ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అంటే... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు... 2026 దాకా జ‌ర‌గ‌ద‌ని కేంద్రం విడ‌మ‌ర‌చి చెప్పిన‌ట్లే లెక్క‌.

ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన కాసేప‌టికే హోం మంత్రి రాజ్ నాథ్ కార్యాల‌యం ముందు ప్ర‌త్య‌క్ష‌మైన వెంక‌య్య మాత్రం... 2019 ఎన్నిక‌ల నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య ఖాయంగా పెరుగుతుంద‌ని చెప్పేశారు. ఈ దిశ‌గా కేంద్ర హోం శాఖ నోట్‌ను కూడా సిద్ధం చేస్తోంద‌ని కూడా వెంక‌య్య చెప్పేశారు. మ‌రి ఈ సీట్ల సంఖ్య‌ను పెంచే బాధ్య‌త‌లు మోస్తున్న కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి గంగారాం చేసిన ప్ర‌క‌ట‌న మాటేంటి? సీట్ల సంఖ్య‌ను పెంచే శాఖకు చెందిన మంత్రి స్వ‌యంగా ఆ దిశ‌గా ఇప్పుడు చ‌ర్య‌లేమీ లేవ‌ని చెబుతుంటే... వెంక‌య్య మాత్రం సీట్ల సంఖ్య పెంపు ఖాయ‌మంటూ చేసిన ప్రక‌ట‌న తీవ్ర అయోమ‌యానికి తావిచ్చేలానే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపున‌కు సంబంధించి వెంక‌య్య మ‌రోమారు గంద‌ర‌గోళానికి తెర తీశార‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/