Begin typing your search above and press return to search.

మరికొన్నిరోజులు హైదరాబాద్ కే పరిమితమా?

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:28 AM GMT
మరికొన్నిరోజులు హైదరాబాద్ కే పరిమితమా?
X
వారం రోజుల్లో ఎక్కడున్నా.. ఆదివారం వచ్చేసరికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి తెలుగు నేల పరిమళం తగలాల్సిందే. ఆయన ఎక్కడ.. ఎంత బిజీగా ఉన్నా.. ఆదివారం మాత్రం అయితే తెలంగాణలో.. లేదంటే ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తుంటారు.

మళ్లీ సోమవారం ఉదయం కల్లా.. ఢిల్లీకి వెళ్లి పోయిన తన రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోతుంటారు. వెంకయ్యనాయుడికి ఇదో అలవాటు. అందులో భాగంగా ఈ ఆదివారం ఆయన తన కార్యక్రమాల్ని తెలంగాణ ప్రాంతంలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఉజ్జయని మహాంకాళి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

ఆయన అమ్మవారిని కోరుకోవటం బాగానే ఉన్నా.. ఆయన చేతుల్లో ఉన్న అంశాల్ని పూర్తి చేస్తే ప్రజలంతా హ్యపీగా ఉంటారు కదా అన్న మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ గళం విప్పి.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ఐదేళ్లు మాట చెప్పించుకొని.. తాను మాత్రం మేం పవర్ లోకి రానున్నాం.. ఐదేళ్లేం ఖర్మ.. పదేళ్లు చేసేస్తామంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే.

తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. ప్రత్యేక హోదా మీద తూచ్ అనేసిన ఆయన.. తాజాగా పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చేశారు. కేంద్రమంత్రి చేసిన తాజా ప్రకటనపై ఏపీలో అగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమకు ఏ మాత్రం ఇష్టం లేకుండా విభజన చేయటమే కాదు.. నాడు ఇచ్చిన హామీల విషయంలో ఇలా పిల్లిమొగ్గలు వేయటంపై వారు కోపంగా ఉన్నారు.

చూస్తుంటే.. రానున్న మరికొన్ని ఆదివారాలు వెంకయ్య నాయుడు ఏపీకి వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. ఒకవేళ ఆయన తనకున్న అధికార ధీమాతో అడుగు పెట్టినా.. తీవ్ర వ్యతిరేకత.. తిట్లు తినాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఆదివారం అయితే చాలు తెలుగు గడ్డ మీద ఉండే వెంకయ్య రానున్న ఆదివారాలు హైదరాబాద్ కే పరిమితం అవుతారా? లేక ఏపీలో కూడా అడుగుపెడతారా? అన్నది చూడాలి.