Begin typing your search above and press return to search.

బాబును కెలుక్కోవద్దన్న వెంకయ్య..?

By:  Tupaki Desk   |   6 March 2017 5:07 AM GMT
బాబును కెలుక్కోవద్దన్న వెంకయ్య..?
X
ఏపీ మీదా.. ఆంధ్రుల పైనా తనకున్న ప్రేమాభిమానాల్ని తన మాటలతో అప్పుడప్పడు పొంగి పొర్లించే ప్రయత్నం చేస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నిజంగా ఆయనకు ఆంధ్రోళ్ల మీద ఎంత ప్రేమ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. విభజన సమయంలోనూ.. విభజన తర్వాత రెండు కళ్ల సిద్దాంతాన్ని వల్లె వేసిన ఆయన విభజనలో ఎంత కీ రోల్ ప్లే చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రోళ్ల ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు రెండు కళ్లుగా అభివర్ణించటమే కాదు.. 2019 ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించే వరకూ హైదరాబాద్ వదిలి రానంటూ వ్యాఖ్యలు చేయటాన్ని ఎవరు మాత్రం మర్చిపోగలరు.

చెట్ల కింద కూర్చొని తాను పాలించానని.. ఎంతో శ్రమపడి ఏపీని డెవలప్ చేస్తున్నట్లుగా బాబు చెప్పే మాటలన్నీ.. ఓటుకు నోటు ముచ్చట తర్వాతేనన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. కానీ.. ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు.. ఏపీ అభివృద్ధి కోసం తానెంతగా ఆరాటపడుతున్నది చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఏపీ మీద తనకున్న ప్రేమను.. ఏపీ ప్రజల బతుకుల్ని మార్చే ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద అస్సలు ఫోకస్ చేయని ఆయన.. అప్పుడప్పుడు ఏపీ ప్రజల భావోద్వేగాల్ని టచ్ చేసేలా.. విభజన సందర్భంగా దారుణం జరిగిందని.. అదో చీకటి పరిణామంగా బోలెడంత ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. విభజన ప్రక్రియను తప్పు పట్టే మాటల్ని ఈ మధ్యన బాబు నోటి వెంట రావటం.. దీనిపై తెలంగాణ అధికారపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడటం జరిగిపోయాయి. ఏపీకి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో బాబు కమిట్ మెంట్ మీద అందరూ ఆగ్రహంగా ఉన్న వేళ.. తనకు ఏపీ అన్నా.. ఆంధ్రులన్నా ఎంత అభిమానమన్న విషయాన్ని చెప్పుకునే క్రమంలో విభజన ఎపిసోడ్ పై విమర్శలు చేయటం బాబుకు అలవాటే.

ఇదిలా ఉంటే.. బాబు తీరును పరోక్షంగా తప్పు పడుతూ ఆయన జిగిరీ దోస్త్ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యల్ని కాస్త అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని గడిచిన చరిత్ర అనో.. అనవసరమనో చెప్పే వెంకయ్య.. విభజనను కూడా గడిచిన చరిత్ర ఖాతాలో వేసేశారు. నవ్యాంధ్ర అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలన్న ఆయన.. విభజన నాటి అంశాల్నిపట్టించుకోవద్దన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

వెంకయ్య నోటి నుంచి వచ్చిన ఈ మాటలు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విభజన నాటి సంగతుల్ని కెలుక్కోవద్దన్న సంకేతాన్ని ఇచ్చేలా వెంకయ్య మాట ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన విషయాన్ని వదిలేయాన్నట్లుగా మాట్లాడే వెంకయ్య.. తాను యువకుడిగా ఉన్నప్పుడు మహా హుషారుగా తిరిగి జై ఆంధ్రా ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ.. అప్పుడే కానీ ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే.. దేశంలోనే ఏపీ ముందు ఉండేదని చెప్పుకున్నారు. విభజన ముచ్చటే గడిచిన చరిత్రగా ఫీలయ్యే వెంకయ్య.. ఆంధ్రోళ్లకు అస్సలు గుర్తే లేని జై ఆంధ్రా ఉద్యమం గురించి ఎందుకు ప్రస్తావిస్తారో? తనను హీరోగా ఫోకస్ చేసే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/