Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య‌..తొలి టార్గెట్ మీడియానే!

By:  Tupaki Desk   |   11 Aug 2017 11:38 AM GMT
ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య‌..తొలి టార్గెట్ మీడియానే!
X
ముప్ప‌వ‌ర‌పు వెంకయ్య‌నాయుడు... నిన్న‌టిదాకా క‌ర‌డుగ‌ట్టిన కాషాయ‌వాది. ఆరెస్సెస్ సిద్ధాంతాల‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్న బీజేపీ నేత‌గా... వెంక‌య్య‌నాయుడు వైరి వ‌ర్గాల‌కు నిన్న‌టిదాకా ఫైర్ బ్రాండే. వెంక‌య్య‌పై ఏదైనా విమ‌ర్శ చేస్తే... ఎటు నుంచి ఎటు విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డ‌తాయోన‌న్న భ‌యంతో విప‌క్ష నేత‌లు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి మ‌రీ నోరు విప్పేవారు. పార్ల‌మెంటులో కూడా వెంక‌య్య వైఖ‌రి అలాగే ఉండేది. ప్రాస‌తో కూడిన సెటైర్ల‌తో వెంక‌య్య సంధించే విమ‌ర్శ‌ల‌కు విప‌క్షాల‌కు చెందిన వారు ఎంత‌టి వారైనా చిత్తు కావాల్సిందే. తెలుగు స‌హా ఆంగ్లం, హిందీలో అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించే స‌త్తా ఉన్న వెంక‌య్య... ఆ మూడు భాష‌ల్లోనూ త‌న‌దైన శైలిలో వాక్ప‌టిమ ప్ర‌ద‌ర్శించారు.

అయితే ఇదంతా నిన్న‌టిదాకా ఉన్న ప‌రిస్థితి. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ఇప్పుడు వెంక‌య్య‌నాయుడు బీజేపీ నేత కాదు. భార‌త దేశానికి ఉప రాష్ట్ర‌ప‌తి. అంటే దేశానికి ప్ర‌థ‌మ పౌరుడిగా ఉన్న రాష్ట్రప‌తి త‌ర్వాతి స్థాన‌మ‌న్న మాట‌. నేటి ఉద‌యం రాజ్య‌స‌భ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో భాగంగా వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా పెద్ద‌ల స‌భ‌గా పిలుచుకునే రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను ఉద్దేశించి ఉప‌రాష్ట్రప‌తి హోదాలో వెంక‌య్య త‌న తొలి ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు సంధించ‌డం కాస్తంత ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

అయినా వెంక‌య్య త‌న ప్ర‌సంగంలో ఏమేం మాట్లాడార‌న్న విష‌యానికి వ‌స్తే... సభలో అన్ని పార్టీల సభ్యులు తనకు సమానమేనని ఆయ‌న అన్నారు. రాజ్య‌స‌భ‌లో అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా అన్ని పార్టీల స‌భ్యుల‌కు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు. రాజ్య‌స‌భ‌లో విలువైన స‌మ‌యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో జ‌రిగే చ‌ర్చ‌ల్లోని అంశాలను మీడియా చూపిస్తోన్న తీరుపై వెంక‌య్య నాయుడు విమ‌ర్శ చేశారు. స‌భ‌లో నిర్మాణాత్మకంగా జరిగే చర్చలను మీడియా ప్రసారం చేయాలని అన్నారు. మీడియా అలా చేయ‌కుండా స‌భ‌లో చెల‌రేగే వివాదాలు, సంచలనాలకు ప్రాధాన్యం ఇచ్చి చూప‌డం స‌రికాద‌న్నారు. ఉప‌రాష్ట్రప‌తి హోదాలో వెంక‌య్య త‌న తొలి ప్ర‌సంగంలోనే మీడియాపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ్యాఖ్య‌లు చేసిన తీరుపై ఆయా మీడియా సంస్థ‌లు లోలోప‌లే మ‌ద‌న‌ప‌డిపోతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.