Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌లో ఆ మాటే వాడొద్దంటున్న వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   16 Dec 2017 5:05 AM GMT
రాజ్య‌స‌భ‌లో ఆ మాటే వాడొద్దంటున్న వెంక‌య్య‌
X
సుదీర్ఘ‌మైన రాజ‌కీయ జీవితం ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడి సొంతం. చిన్న‌స్థాయి రాజ‌కీయ కార్య‌క‌ర్త‌గా మొద‌లై.. దేశంలోనే రెండో అత్యున్న‌త స్థానాన్ని అలంక‌రించిన ఆయ‌న ఇప్పుడు త‌న‌దైన మార్క్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ్య‌స‌భ‌కు ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించే ఉప‌రాష్ట్రప‌తి హోదాలో తాజాగా ఆయ‌న చేసిన సూచ‌న ఒక‌టి ఇప్పుడు అంద‌రిని ఆకట్టుకుంటోంది.

ద‌శాబ్దాల ప‌ర్యంతం అల‌వాటుగా ఉన్న వైనాన్ని త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ఇలాంటి తీరు వ‌ద్దంటే వ‌ద్దంటున్న వెంక‌య్య తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి లాంటి కొన్నింటిని మార్చేయాల‌న్న ఆలోచ‌న‌లో వెంక‌య్య ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. రాజ్య‌స‌భ‌లో త‌న మార్క్ చూపిస్తున్న వెంక‌య్య తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

రాజ్య‌స‌భ‌లో ఏదైనా ప‌త్రాల్ని ప్ర‌వేశ పెట్టేట‌ప్పుడు స‌భ్యులు "ఐ బెగ్ టు" అని పలికేవారు. ఆ మాట వ‌ల‌స‌వాదానికి నిద‌ర్శ‌మ‌ని.. స్వ‌తంత్ర భార‌తంలో జీవిస్తున్న మ‌నం.. ఐ బెగ్ టు అని ప‌ల‌క‌టం ఏమిట‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల ప్రారంభం సంద‌ర్బంగా తొలిరోజు స‌భ‌లో స‌భ్యుడు ఒక‌రు ప‌త్రాన్ని ప్ర‌వేశ పెట్టేట‌ప్పుడు సంప్ర‌దాయం ప్ర‌కారం ఐ బెగ్ టు అన్న ప‌దాన్ని వాడిన‌ప్పుడు.. ఆ ప‌దం వ‌ల‌స‌వాదానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. ఆ ప‌దాన్ని వ‌దిలేయ‌టం మంచిద‌న్న సూచ‌న‌ను చేశారు.

తాను చేసింది సూచ‌న మాత్ర‌మే కానీ ఆదేశం కాద‌ని చెప్పారు. అంతేకాదు.. మృతి చెందిన స‌భ్యుల‌కు సంతాప ప్ర‌క‌ట‌న చ‌దివే సంద‌ర్భంలో స‌భ్యులంతా లేచి నిల‌బ‌డితే.. అధ్య‌క్ష స్థానంలో ఉండే వారు మాత్రం నిలుచునేవారు కాదు. దీనికి భిన్నంగా వెంక‌య్య మాత్రం లేచి నిలుచుంటున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా వెంక‌య్య అడుగులు వేస్తున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.