Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపకంపై జోరు పెరిగింది

By:  Tupaki Desk   |   29 March 2016 9:04 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపకంపై జోరు పెరిగింది
X
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కంటే రాజకీయ అంశాల మీదనే పార్టీల ఫోకస్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు వీలైనంత త్వరగా తమ తమ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందే. విభజన కారణంగా ఏపీకి ఇచ్చిన హామీల అమలులో ఏపీ సర్కారు చేస్తున్న కృషి ఒక కొలిక్కి వస్తుందో రాదో కానీ.. రాజకీయ పార్టీలకు లాభం కలిగే అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా మారిందన్న భావన వ్యక్తమవుతోంది.

ఏపీలోని ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల్ని 225కు.. తెలంగాణలో 153కు పెంచే అంశంపై న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా కేంద్రమంత్రి వెంకయ్య ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయ.. హోం.. ఆర్థిక.. రెవెన్యూ శాఖలకు చెందిన కార్యదర్శులతో ఆయన సమావేశం అవుతున్నారు.

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచే విషయాన్ని 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఒక కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా వెంకయ్య వైఖరిని చూస్తే అర్థమవుతుంది. ఈ విషయానికి సంబంధించి త్వరలో హోం.. న్యాయశాఖల నుంచి రాతపూర్వక అభిప్రాయాన్ని కేంద్రం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగటం ఖాయమన్నట్లుగా ఉందని చెప్పాలి.