Begin typing your search above and press return to search.

వెంకయ్య అరిచి గీ పెట్టినా ఎందుకు మారరు?

By:  Tupaki Desk   |   23 Sep 2015 11:30 PM GMT
వెంకయ్య అరిచి గీ పెట్టినా ఎందుకు మారరు?
X
ఎవరు అవునన్నా.. కాదన్నా మోడీ జమానా కేంద్రంలో కొనసాగినంత కాలం తెలుగు వారికి ఢిల్లీలో పెద్ద తలకాయ ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడే. ఈ విష​యం​​లో చాలామందికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఢిల్లీలో వెంకయ్యనాయుడే కానీ లేకపోతే అన్న ఆలోచనకే తెలుగు నేతలు తల్లడిల్లిపోయే పరిస్థితి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలున్నా.. వెంకయ్యకున్న పరిచయాల్లో పది శాతం కూడా ఎవరికీ​ ఉండవేమో. ఎక్కడికైనా దూసుకెళ్లటంతో పాటు.. బీజేపీ అగ్రనేతలు సైతం.. ఆయన ఆలోచనల గురించి సంప్రదింపులు జరుపుతుంటారు. మరి.. ఇంత పలుకుబడి ఉన్న వెంకయ్య సొంత రాష్ట్రానికి ఏం చేయటం లేదన్న విమర్శ​ ఈ మధ్య బాగా పెరిగింది.

సొంతరాష్ట్రానికి ఏమీ చేయకూడదన్న భావనలో వెంకయ్య ఉంటారా? అన్న ప్రశ్న చాలామంది సంధిస్తుంటారు. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న​ ఒక అనుమానం మాత్రమే.​​​​​ ఎందుకంటే.. ఢిల్లీలో వెంకయ్యకు వచ్చిన​ పేరు ప్రఖ్యాతులన్నీ ఆయన వైఖరి కారణంగానే​ వచ్చాయన్న విషయాన్ని​ మర్చిపోకూడదు. అద్వానీ లాంటి పెద్ద తలకాయల్ని సైతం తోసిరాజ​నే మోడీ ఎందుకు వెంకయ్యకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే... మోడీ అడుగులకు మడుగులు వొత్తే టాలెంట్ వెంకయ్య​ కు సొంతం. వెంకయ్య విజయమంతా కూడా ఆయన వైఖరిలోనే ​ఉంది. ఆయన కానీ తన మనసు చెప్పినట్లో.. లేక తన ప్రాంతవాసులు చెప్పినట్లో భావోద్వేగంతో వ్యవహరిస్తే.. ఆయనకున్న కోరల్ని పీకేసి పక్కన పెట్టేయటానికి మోడీ లాంటి నేతకు మహా అయితే పది నిమిషాల సమయం కంటే ఎక్కువ పెట్టొచ్చు. వెంకయ్య ఏమీ ప్రజాకర్షక నేతేమీ కాదన్న విషయం మర్చిపోకూడదు. నిజానికి అదే ఆయనకు శ్రీరామరక్ష కూడా. అలాంటి వారే మోడీ పక్కన ఉంటారు. కావాలంటే మోడీకి అత్యంత సన్నిహితులైన నేతల్ని చూడండి. వారిలో ఎవరూ ప్రజాకర్షణ​ ఉన్న​ నేతగా కనిపించరు. మోడీ సూర్యుడైతే.. మిగిలిన వారంతా ఆ కాంతితో బతికేసే వారే తప్పించి.. స్వయం ప్రకాశితాలు కాదన్న విషయం మర్చిపోకూడదు.

ఇలాంటి విషయాలన్నీ వెంకయ్యకు తెలియంది కాదు. అందుకే.. ఆయన్ను ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోరు. ఏపీకి ఏమీ చేయలేకపోతున్నావే అంటూ ఆవేశంతో అరిస్తే.. వారి వంక జాలిగా చూస్తారే తప్పించి ప్రతిస్పందించరు. అత్యున్నత స్థానంలో ఉండి కూడా ఏమీ చేయలేనితనం ఆయనకు మాత్రం అసంతృప్తి కలిగించేదే. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా... మోడీకి జాన్ జిగిరి దోస్తానా ఉన్నట్లు చెప్పుకున్నా.. అదంతా మోడీకి కట్టుబానిసలా విధేయతతో ఉన్నంత వరకనే అని.. ఆయన మాట కాదని ఒక్కమాట మాట్లాడినా అంతే సంగతులు. అందుకే కాబోలు.. ఏపీ నుంచి వచ్చిన ముఖ్యనేతల్ని తన నివాసానికి పిలిపించుకొని టిఫి​న్లు పెట్టి.. టీలు తాగించి పంపించటం తప్పించి.. ఆయనకు ఆయన ఎలాంటి హామీలు ఇవ్వరు. మహా అయితే.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించటంలో కాస్తంత హెల్ప్ చేస్తారు. అంతకు మినహా.. ఆయనేమీ చేయలేని పరిస్థితి. వెంకయ్య పరిస్థితి చూస్తే.. ముఖ్యనేతలకు టిఫిన్లు పెట్టిస్తారు కానీ ఏపీకి ఎలాంటి టిఫిన్ పెట్టిం​చలేరు.