Begin typing your search above and press return to search.

బాబు ముందే వెంక‌య్య‌..కేసీఆర్‌ ను పొగిడేశారే!

By:  Tupaki Desk   |   4 Oct 2017 11:36 AM GMT
బాబు ముందే వెంక‌య్య‌..కేసీఆర్‌ ను పొగిడేశారే!
X
దేశ ఉప రాష్ట్రపతి - కేంద్ర మాజీ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు భాష పరిరక్షణకు కేసీఆర్ తీసుకున్న చర్యలు ఆదర్శనీయని కొనియాడారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ప్ర‌స్తుతం రైతులకు అరువులు మిగిలాయ‌ని, అన్నదాత విలువను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారు గౌరవంగా బతికేలా చేయూతనివ్వాల‌ని వెంక‌య్య‌నాయుడు అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల‌కు తాత్కాలిక ఉపశమనం కలిగించే పథకాల‌ను తీసివేసి, వారికి మౌలిక వసతులను కల్పించి ప్రోత్సహించాల‌ని సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరులో స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వ‌ర్యంలో మంగళవారం 'రైతు నేస్తం' పురస్కార ప్ర‌దానోత్స‌వ‌ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వెంక‌య్య‌నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్యకు ప్రకృతిరత్న బిరుదునిచ్చి సత్కరించారు. ఎన్జీ రంగా అగ్రి వ‌ర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణకు కృషిరత్న ప్రదానం చేశారు. తెలుగు భాష, తెలుగు రైతుల గొప్పతనం గురించి వెంక‌య్య ప్ర‌సంగించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన కేసీఆర్ ను ఉప రాష్ట్రప‌తి అభినందించారు.

ఉప రాష్ట్రపతిగా ఎంపికైన తర్వాత తొలిసారి వెంకయ్య హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేసీఆర్ కు వెంక‌య్య‌నాయుడు సూచించారు. వెంకయ్య ప్రతిపాదనపై వెంటనే స్పందించిన కేసీఆర్.. దీని అమలుకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే విషయాన్ని 'రైతు నేస్తం' పురస్కార ప్ర‌దానోత్స‌వ‌ కార్యక్రమంలో వెంక‌య్య ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్ర‌శంసించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ తెలుగు తప్పనిసరి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాల పేర్లు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని, ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా తెలుగులోనే ఉండేలా చూడాలన్నారు. మాతృభాషను మర్చిపోయే వారు అసలు మ‌నిషే కాదని వెంక‌య్య‌ అన్నారు. భాష బతకాలంటే అన్ని విద్యాసంస్థల్లో తెలుగును నిర్బంధం చేయాలని అభిప్రాయ‌ప‌డ్డారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధరను తానే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాల‌ని, ఇందుకోసం వారి ఆలోచన, ఆచరణ విధానాల్లో మార్పు రావాల‌ని వెంక‌య్య అన్నారు. భ‌విష్య‌త్తులో రైతురాజ్యం రావాల‌ని వెంకయ్య ఆకాంక్షించారు. రైతుల‌కు అందుబాటులో స‌ర‌స‌మైన రుణాలు, 12 గంటల మెరుగైన కరెంట్‌, నీటి వసతి ఉంటే రైతులు న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతార‌ని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం స‌రికాద‌ని వెంక‌య్య అన్నారు.