Begin typing your search above and press return to search.

రవిశాస్త్రే కాదు.. రేసులో అతను కూడా

By:  Tupaki Desk   |   29 Jun 2017 10:26 AM GMT
రవిశాస్త్రే కాదు.. రేసులో అతను కూడా
X
ఏడాది కిందట అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టు కోచ్ అయినప్పుడు.. ఇంకో మూణ్నాలుగేళ్లు కోచ్ సంగతి మరిచిపోవచ్చని అంతా అనుకున్నారు. కుంబ్లేతో ముందుగా ఏడాది ఒప్పందమే చేసుకున్నప్పటికీ దాన్ని తర్వాత రెండు మూడేళ్లకు పొడిగించడం పక్కా అనుకున్నారు. ఆటగాడిగా కుంబ్లేకు ఉన్న మంచి పేరు దృష్ట్యా అతను కోచ్ గా కూడా విజయవంతమవుతాడని అంచనా వేశారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. కానీ తన కఠిన వైఖరి కారణంగా కోహ్లితో పాటు మిగతా ఆటగాళ్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొని ఏడాదికే కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడు కుంబ్లే. ఇప్పుడు అతడి వారసుడిని ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ.

కుంబ్లే వైదొలిగే సమయానికి కోచ్ పదవికి ప్రధాన పోటీదారులు వీరేంద్ర సెహ్వాగ్.. టామ్ మూడీలే. కానీ ఇప్పుడు కొత్తగా ఇద్దరు ప్రముఖులు కోచ్ పదవికి రేసులోకి వచ్చారు. వాళ్లిద్దరూ కూడా గట్టి పోటీదారులే అయ్యారు. కుంబ్లే కోచ్ కావడానికి ముందు టీమ్ ఇండియా డైరెక్టర్ గా దాదాపు కోచ్ బాధ్యతల్ని నిర్వర్తించి.. ఆపై కోచ్ పదవికి కూడా పోటీలో నిలిచి.. కుంబ్లే రేసులోకి రావడంతో పక్కకు తప్పుకోవాల్సి వచ్చిన రవిశాస్త్రి ఇప్పుడు మళ్లీ అదే పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. గత అనుభవాల దృష్ట్యా రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి నిరాకరించగా.. కోచ్ ను ఎంపిక చేసే క్రికెట్ సలహా కమిటీ సభ్యుడైన సచిన్ స్వయంగా రవిశాస్త్రిని ఒప్పించినట్లు సమాచారం. కోహ్లితో రవిశాస్త్రికి సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఇక రవిశాస్త్రి కోచ్ కావడం పక్కా అని అంతా అనుకుంటుండగా.. మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ కొత్తగా రేసులోకి వచ్చాడు. అతడికి కోచింగ్ అనుభవం బాగానే ఉంది. ప్రస్తుతం జాతీయ జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవిలో ఉన్నాడు ప్రసాద్. సెప్టెంబరులో పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఇక ప్రధాన కోచ్ అయిపోదామని దరఖాస్తు పెట్టేశాడట ప్రసాద్. రవిశాస్త్రి అంటే గంగూలీకి పడదన్న సంగతి తెలిసిందే. మరి గత ఏడాది అతడికి గండికొట్టినట్లే ఈసారి చెక్ పెట్టి వెంకటేష్ ప్రసాద్ లేదా ఇంకొకరికి కోచ్ గా గంగూలీ అవకాశం కల్పిస్తాడేమో చూడాలి. కోచ్ ఎంపిక చేసే కమిటీలో సచిన్.. గంగూలీలతో పాటు లక్ష్మణ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/