Begin typing your search above and press return to search.

వేణుగోపాలాచారి అలా వార్నింగ్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   9 March 2016 5:08 AM GMT
వేణుగోపాలాచారి అలా వార్నింగ్ ఇచ్చారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రుళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ఏపీలో కనిపించని ఒక దృశ్యం.. తెలంగాణలో స్పష్టంగా కనిపించే పరిస్థితి. ఏపీ అధికారపక్షానికి చెందిన నేతల కారణంగా ప్రభుత్వం ఇబ్బందులకు గురి కావటం ఎక్కువగా ఉంటే.. తెలంగాణలో మత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. చేతిలో అంతులేని అధికారం ఉన్నా.. తొందరపడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనాలు చాలా తక్కువ. గడిచిన 22 నెలల కాలంలో ఏపీ నేతల వైఖరి కారణంగా ఏపీ సర్కారు అడ్డంగా బుక్ అయిన సందర్భాలెన్నో. కానీ.. తెలంగాణలో అలాంటి పరిస్థితి కాస్త తక్కువ. ఒకవేళ అలాంటిది ఉన్నా.. ఆ వ్యవహారం బయటకు వచ్చేలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ కావటం.. దాన్ని సెట్ చేయటం జరుగుతోంది.

అలాంటిది.. తాజాగా తెలంగాణకు చెందిన వేణుగోపాలాచారిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఒక వ్యక్తి.. ఒక ప్రముఖ మీడియా సంస్థను ఆశ్రయించటం.. తమ గోడును చెప్పుకోవటం.. తమకు ఎదురైన ఇబ్బందిని వెల్లడించటం.. ఆ విషయాలు సదరు మీడియా సంస్థలో ప్రముఖంగా రావటం ఆసక్తిరంగా మారింది. ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీకి.. మరి ముఖ్యంగా కేసీఆర్ కు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తిగా వేణుగోపాలాచారి వ్యవహరిస్తున్నారు. ఆయనపై తాజాగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ లో కొత్తగా నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టిన తనకు.. వేణుగోపాలాచారి నుంచి బెదిరింపులు వస్తున్నట్లుగా కాంట్రాక్టర్ రవీంద్ర ఆరోపించటం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. వేణుగోపాలాచారి కారణంగా తాను టెండర్ ను వదులుకోవటానికి సిద్ధమేనని.. కాకుంటే ఈ పని కోసం తాను రూ.6లక్షలు ఖర్చు చేశానని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పిస్తే చాలని చెప్పటం సంచలనంగా మారింది.

పనుల్ని తక్షణమే ఆపేయాలని.. లేదంటే తానే స్వయంగా వచ్చి కూల్చేస్తానంటూ వేణుగోపాలాచారి విరుచుకుపడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. తమ ప్రభుత్వం పవర్ లో ఉన్నప్పుడు తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే నష్టం తప్పదని హెచ్చరించటమేకాదు.. తన మాట వినకుండా అదే తీరులో నిర్మాణం కొనసాగిస్తే కూలగొడతానంటూ చెప్పటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. తన జట్టు సభ్యులు కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూస్తున్న కేసీఆర్.. తాజాగా వేణుగోపాలాచారి మీద వస్తున్న ఆరోపణల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.