Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల మహాపాదయాత్రపై హైకోర్టు తీర్పు ఇదే!

By:  Tupaki Desk   |   9 Sep 2022 8:10 AM GMT
అమరావతి రైతుల మహాపాదయాత్రపై హైకోర్టు తీర్పు ఇదే!
X
న‌వ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులు ఈ నెల 12 నుంచి అమ‌రావ‌తి టు.. అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్ర 2.0కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. పాదయాత్ర అనుమతి కోసం అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో గ‌త రెండు రోజులుగా విచార‌ణ జ‌రిపిన‌కోర్టు శుక్ర‌వారం ఉద‌యాన్నే.. రైతుల‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పోలీసుల‌ను హైకోర్టు ఆదేశించింది.

అంతేకాదు.. 600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు హైకోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. అయితే.. పాల్గొనే వారి పేర్లు ముందుగానే న‌మోదు చేసి.. వారికి ఐడి కార్డులు ఇవ్వాలని రైతుసంఘాల‌కు.. పోలీసుల‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగుతుందని స్ప‌ష్టం చేసింది. ఇక‌, పాదయాత్ర ముగింపు రోజు బహిరంగ సభ అనుమతి కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు కోర్టు సూచించింది.

అదేస‌మ‌యంలో ముగింపు రోజు నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన దరఖాస్తు పరిశీలించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్న ఉన్నం మురళీధర్, వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

అయితే.. గురువారం రోజంతా కూడా రైతుల పాద‌యాత్ర పై.. నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. వారికి అనుమ‌తి ఇచ్చే విష‌యాన్ని ఇంకా నిర్ణ‌యించ లేద‌ని పోలీసులు కోర్టు వివ‌రించారు. దీనిపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇంకా నిర్ణ‌యించ‌క‌పోవ‌డం ఏంట‌ని నిల‌దీసింది. దీంతో రాత్రికి రాత్రి.. డీజీపీ.. రైతుల పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేదంటూ.. తిర‌స్క‌రించారు.

హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్ ఇవే..అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర కు అనుమ‌తించిన కోర్టు.. ఈ సంద‌ర్భంగా సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసింది. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయవచ్చు గానీ.. 600 మంది రైతులు పాదయాత్ర చేయకూడదాఅని నిల‌దీసింంది. 600 మంది రైతుల పాదయాత్రకు మీరెందుకు బందోబస్తు కల్పించలేరని హోం శాఖ‌ను ప్ర‌శ్నించింది. భార‌త్‌ జోడో యాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే అనుమతి ఇచ్చారని తెలిపింది.

ఢిల్లీలో సమస్యలపై వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే అనుమతులు ఇచ్చారని, అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారని తెలిపింది. 35 వేల మంది రైతుల్లో 600 మంది రైతులు పాదయాత్రలు చేస్తుంటే.. మీరు బందోబస్తు కల్పించలేరా అని ప్ర‌శ్నించిన హైకోర్టు.. అనుమ‌తి ఇచ్చితీరాల్సిందేన‌ని పోలీసుల‌ను ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.