Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ.. ఆ సీనియర్ నేత ఇక లేరు

By:  Tupaki Desk   |   25 Nov 2020 2:02 AM GMT
కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ.. ఆ సీనియర్ నేత ఇక లేరు
X
తెర ముందుకు చాలామంది నేతలు కనిపిస్తుంటారు. కానీ.. ఒక రాజకీయ పార్టీకి తెర వెనుక ఉండి నడిపించే శక్తివంతమైన నేతలు కొందరు ఉంటారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో అలాంటి వారికి చాలా తక్కువ. అలాంటి నేత అహ్మద్ పటేల్. కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలకమైన ప్రతి నిర్ణయం వెనుక ఆయన ఉంటారు. ఆ మాటకు వస్తే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కుడి భుజంగా అభివర్ణించే సీనియర్ నేత అహ్మద్ పటేల్.. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ఆయన.. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూసినట్లుగా ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గుజరాత్ కు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నేత వయసు 71 ఏళ్లు. నెల క్రితం కరోనా బారిన పడిన ఆయనకు పలు అవయువాలు దెబ్బ తిన్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగా చెప్పక తప్పదు.

కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తల్లో ఆయన కీలకభూమిక పోషిస్తుంటారు. సోనియమ్మ అపాయింట్ మెంట్ దగ్గర నుంచి ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన ఉంటారు. మిగిలిన నేతల మాదిరి తెర మీద కనిపించటానికి పెద్దగా ఇష్టపడని ఆయన.. తెర వెనుక చురుగ్గా ఉంటారు. పార్టీకి చెందిన ఎంతోమంది సీనియర్ నేతలు ఆయనకు సన్నిహితులు. ఆయన మరణం పార్టీని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పాలి. కాంగ్రెస్ కు ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదిగా చెప్పక తప్పదు.