Begin typing your search above and press return to search.

సిద్ధార్థ అంత పని చేశాడా?

By:  Tupaki Desk   |   2 Aug 2019 11:39 AM GMT
సిద్ధార్థ అంత పని చేశాడా?
X
కేఫ్ కాఫీ డే సీఎండీ కేజీ సిద్దార్థ ఆత్మహత్య క్రియేట్ చేసిన సంచలనం ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మరణించిన తీరుపై పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది. కొన్ని పత్రిక లైతే ఆయన మరణానికి కారణం వ్యవస్థేనని పేర్కొనటం తెలిసిందే. సిద్దార్థ మరణం తర్వాత కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి చేదు నిజం ఒకటి బయటకు వచ్చింది.

కేఫ్ కాఫీడే కు చెందిన ఉద్యోగులు.. ఉన్నతాధికారులు కొందరు నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకుల వద్ద నుంచి ఏకంగా రూ.145 కోట్లు అడ్డదారిలో అప్పులుగా తీసుకున్న వైనం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఆదాయపన్ను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. సిద్దార్థ మరణం తర్వాత ఆయన ఆర్థిక విషయాలకు సంబంధించిన వివరాల్ని ఐటీ అధికారులు క్రాస్ చెక్ చేయటం షురూ చేశారు. ఈ నేపథ్యంలో కేఫ్ కాఫీడే ఉద్యోగులు అన్నదాతల పేరుతో నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయిలు రుణాలు పొందటమే కాదు.. వాటిని సిద్దార్థకు చెందిన ఇతర కంపెనీలకు తరలించిన వైనాన్ని గుర్తించారు.

తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఉన్నతాధికారి ఒకరు ఇదే తీరులో రుణం తీసుకొన్న వైనాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. చిక్ మగళూర్ లోని కాఫీ సాగు చేస్తున్న రైతులుగా పేర్కొంటూ నకిలీ గ్రూపులకు సంబంధించిన పత్రాల్ని హామీ పత్రాలుగా బ్యాంకులకు సమర్పించి.. వందల కోట్ల అక్రమంగా అప్పు తీసుుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదే తీరులో మరింత లోతుగా విచారణ చేస్తే..ఇంకెన్ని విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.