Begin typing your search above and press return to search.

దేశం కోసం పోరాడ‌ట‌మే తీవ్ర‌వాదం అవుతుందా?

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:00 PM GMT
దేశం కోసం పోరాడ‌ట‌మే తీవ్ర‌వాదం అవుతుందా?
X
అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) విడుద‌ల చేసిన వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ పై నిర‌స‌న‌లు ఇంకా చ‌ల్లార‌డం లేదు. ప్రతి సంవత్సరం వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక - సామాజిక - రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్‌ - భజరంగ్‌ దళ్‌ లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల‍్పడే సంస్థలుగానూ - ఆర్‌ ఎస్‌ ఎస్‌ ను జాతీయ సంస్థగా ప్రకటించింది. దీనిపై ఆయా సంస్థ‌లు భ‌గ్గుమ‌ని కాన్సులేట్ కేంద్రాల వ‌ద్ద నిర‌స‌న తెలిపాయి. దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న మమ్మల్ని తీవ్రవాదులు అంటారా? అంటూ మండిప‌డ్డాయి.

సీఐఏ రిపోర్టు మీద వీహెచ్‌ పీ - భజరంగ్ దళ్ కార్యకర్తలు భగ్గుమన్నారు. హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు యత్నించారు. కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీంతో, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించి వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు - భజరంగ్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ చందర్‌ తో పాటు కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేశారు. దీనిపై వీహెచ్‌ పీ స్పందించింది. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది.

రాజకీయ పరమైన ఒత్తిడిని కలిగిస్తూ... ఎన్నికల్లో పోటీ చేయని సంస్థలను రాజకీయ ఒత్తిడి బృందాలుగా సీఐఏ పేర్కొన‌డం ఆక్షేప‌ణీయ‌మ‌ని పేర్కొంది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్‌ - భజరంగ్‌ దళ్‌లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.