Begin typing your search above and press return to search.

అలా ప్రకటిస్తే వాళ్లు 'సంతోషంగా' ఉంటారంట

By:  Tupaki Desk   |   20 Jan 2015 4:43 AM GMT
అలా ప్రకటిస్తే వాళ్లు సంతోషంగా ఉంటారంట
X
అందరూ సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? దీనికి మిగిలినవారందరూ చెప్పే మాటలకు భిన్నమైన మాటలు చెబుతున్నారు విశ్వహిందూ పరిషత్‌ నేతలు. రాజ్యాంగ పరంగా భారత్‌ను హిందూదేశంగా ప్రకటించాలని.. అప్పుడే హిందువులు సంతోషంగా ఉంటారని చెబుతున్నారు.

ఇంతకాలం హిందువులు సంతోషంగా బతకనట్లుగా.. ఇప్పుడు సుఖసంతోషాలతో ఉండనట్లుగా వ్యాఖ్యానించటం వల్లో ప్రయోజనం ఏమిటన్నది వీహెచ్‌పీ నేతలకే తెలియాలి. ఉద్రిక్తతలు పెరిగేలా వ్యాఖ్యలు చేయటం వల్ల సుఖసంతోషాలతో కాకుండా పరస్పర సందేహాలతో.. భయాలతో గడపాల్సి వస్తుందన్న విషయం మర్చిపోకూడదు.

రెండువేల ఏళ్ల కిందట ప్రపంచంలో 700 కోట్ల మంది హిందువులు ఉండగా.. ఇప్పుడు 100 కోట్ల మంది మాత్రమే ఉన్నారని.. ఈ సంఖ్య మరింత పడిపోతే హిందువులు స్వేచ్ఛగా జీవించలేరని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఎవరు అధికారంలో ఉన్నా.. ముస్లింలకు అనుకూలంగానే పాలించారని.. హిందూ దేశమైన ఇక్కడ అలా ఎందుకు లేదని ప్రశ్నించారు.

మతం ఆధారంగా ఉన్న పాకిస్థాన్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో వీహెచ్‌పీ నేతలకు తెలియంది కాదు. మతం ఆధారంగా దేశం రూపొందితే.. దాని వల్ల ప్రయోజనం కంటే విపరిణామాలు ఎక్కువ. మతం ఆధారంగా ప్రజల్లో విభజన తీసుకొచ్చేలా వ్యాఖ్యలు చేయటం కంటే.. మతాన్ని ప్రాతిపదికగా ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలు.. నేతల మీద వీహెచ్‌పీ లాంటి సంస్థలు దృష్టి పెడితే బాగుంటుందేమో.