Begin typing your search above and press return to search.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. బీజేపీ మ‌న‌సులో ఉంది వీరేనా?

By:  Tupaki Desk   |   30 Jun 2022 4:16 AM GMT
ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. బీజేపీ మ‌న‌సులో ఉంది వీరేనా?
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే గిరిజ‌న మ‌హిళ ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఇక ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పై దృష్టిపెట్టింది. ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు ఉన్నారు. అయితే ఈసారి ఆయ‌న‌కు మ‌ళ్లీ రెన్యువ‌ల్ దొర‌క‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించి బీజేపీ మ‌న‌సులో వేరే అభ్య‌ర్థులు ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది.

రాష్ట్ర‌ప‌తిగా గిరిజ‌నుల‌కు చాన్సు ఇవ్వ‌డంతో ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ముస్లింల‌కు లేదా ద‌ళితుల‌కు చాన్సు ఇస్తార‌ని అంటున్నారు. బీజేపీ బ‌హిష్కృత నేత‌లు నుపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతో ముస్లిం దేశాల్లో తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌యిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ముస్లిం వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ముక్తార్ అబ్బాస్ న‌క్వీ రేసులో ఉన్నార‌ని అంటున్నారు. బీజేపీ నేత అయిన ముక్తార్ రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ఇటీవ‌లే ముగిసినా ఆయ‌న‌కు రెన్యువ‌ల్ ఇవ్వ‌లేదు. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేసే ఉద్దేశంతోనే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ చేయ‌లేద‌ని అంటున్నారు.

ముస్లింల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా చాన్సు ఇవ్వ‌క‌పోతే ద‌ళితుల‌కు చాన్సు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఆ వర్గానికి చెందిన సీనియర్ నేతల జాబితాను వడపోసి సిద్ధం చేశారని సమాచారం. చాలా దూరదృష్టితోనే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లోత్‌ను కర్నాటక గవర్నర్‌గా పంపారని అంటున్నారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన్ను ఉప‌రాష్ట్ర‌ప‌తి హోదాలో రాజ్య‌స‌భ చైర్మ‌న్ గా కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ద‌ళితుల‌కు చాన్సు ఇచ్చామ‌ని చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

అలాగే ఓబీసీల నుంచి బ‌రిలోకి దించాల‌ని అనుకుంటే.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వంటివారిని ఎంచుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇలా చేస్తే రెండు రాజ్యాంగ ఉన్నత పదవుల్లో మహిళలకే అవకాశం కల్పించినట్టు అవుతుంద‌ని అంటున్నారు.. త‌ద్వారా మ‌హిళ‌ల‌ను పార్టీ వైపు ఆక‌ర్షించ‌డానికి వీలుంటుంద‌ని వివ‌రిస్తున్నారు.