Begin typing your search above and press return to search.

నెల్లూరు పిలగాడికి ఊరిమీద గాలి మళ్లిందబ్బా...

By:  Tupaki Desk   |   10 Jan 2018 11:41 AM GMT
నెల్లూరు పిలగాడికి ఊరిమీద గాలి మళ్లిందబ్బా...
X
వెంకయ్యనాయుడు అంటే ఇప్పుడు మామూలు రాజకీయ నాయకుడు కాదు. గోడల మీద పోస్టర్లు అంటిస్తూ... వాల్ రైటింగ్స్ రాస్తూ పార్టీకి సేవలు చేసిన దశ నుంచి.. అంచెలంచెలుగా ఎదిగి.. ‘హిస్ హైనెస్’ అనే ప్రిఫిక్సుతో.. దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్న నేత ఆయన. భారత ఉపరాష్ట్రపతిగా తెలుగువాళ్లు గర్వించే స్థాయిలో ఉన్న వెంకయ్యనాయుడుకు హోమ్ సిక్ ఎక్కువ అనే మాట ఇటీవలికాలంలో బాగా వినిపిస్తోంది. కేంద్రమంత్రిగా ఉండగా.. విపరీతమైన కార్యభారం ఉండేది గానీ.. వైస్ ప్రెసిడెంట్ గా ఖాళీ సమయం ఎక్కువయ్యాక.. ఆయన ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో గడపడానికి ఇష్టపడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. అయితే ఉపరాష్ట్రపతి హోదాలో మొట్టమొదటిసారిగా.. సంక్రాంతి పండుగకు ఆయన సొంత ఊరు నెల్లూరు కు వచ్చేశారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే .. అనే సామెత ఇందుకే పుట్టి ఉంటుంది. ఆయన దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయినా.. ‘నెల్లూరు పిలగాడే.. ఊరిమీద గాలి మళ్లంగానే.. వొచ్చేసినాడబ్బా’ అనం అక్కడి జనం అనుకుంటున్నారు.

సంక్రాంతి పండగ రాగానే.. ఆంధ్రా వోళ్లంతా హైదరాబాదు నగరం ఖాళీ చేసేసి సొంత ఊళ్లకు వెళ్లినట్లుగానే.. వెంకయ్యనాయుడు కూడా ఢిల్లీ వదిలేసి నెల్లూరు వచ్చేస్తున్నారు. ఇప్పుడెటూ రాజ్యసభ సమావేశాలు కూడా లేవు గనుక.. ఏకంగా ఆరు రోజుల పాటూ నెల్లూరులోనే ఉండబోతున్నారు. పండగపూట సొంత ఊళ్లో గడుపుతుండగా.. జిల్లా వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు.

కార్యభారం లేని ఉన్నత పదవిలో ఉండడం.. ఆ స్థాయిలో ఉన్నప్పటికీ భేషజాలు లేకుండా.. తనవారైన సొంత మనుషులతో కలివిడిగా ఉండడం ఇదంతా కూడా వెంకయ్యానాయుడుకు హాయిగానే అనిపిస్తుండవచ్చు. కానీ.. అధికార గణాలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.

ఆయనేమో ఉపరాష్ట్రపతి.. ఎంత తరచుగా సొంత ఊరికి వచ్చినా సరే.. ప్రోటోకాల్ మర్యాదల్లో వీసమెత్తు లోటు జరగడానికి గానీ, అపశృతి దొర్లడానికి గానీ వీల్లేదు. భద్రత పరంగా.. ఆయన ఎలాంటి థ్రెట్ ఉన్న నాయకుడు కాకపోయినా.. అధికారులు మాత్రం పూర్తి సన్నాహాల్లో ఉండాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన పాల్గొనే అనేకానేక కార్యక్రమాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడానికి వారు అధికార్లు అష్ట కష్టాలు పడుతున్నారని జిల్లాలో చెప్పుకుంటున్నారు.