Begin typing your search above and press return to search.

జస్ట్ ఛాన్స్ మిస్ : తెలుగు వారికి నిండా నిరాశ...

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:20 PM GMT
జస్ట్ ఛాన్స్ మిస్  :  తెలుగు వారికి నిండా నిరాశ...
X
తెలుగు వారికి 2022 జూన్ 21 రోజంతా ఆశ నిరాశల మధ్య గడిచింది. ఎందుకంటే ఆ రోజులోని కొన్ని గంటల పాటు కాబోయే రాష్ట్రపతిగా తెలుగువారు అవుతారు అన్న చర్చ వాడి వేడిగా సాగింది. ఉప రాష్ట్రపతిగా ఉన్న ఎం వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి పదవి చాలా దగ్గరలో ఉందనే అంతా అనుకున్నారు.

దేశానికి ప్రధమ పౌరునిగా తెలుగు వారు తన దర్జాను ఇక మీదట రాష్ట్రపతి భవన్ లో ధీటుగా చాటుతారు అని భావించారు. వరల్డ్ యోగా డే ఉత్వవాల‌లో హడావుడిగా హైదరాబాద్ లో గడుపుతున్న వెంకయ్యనాయుడుకు ఢిల్లీ కబురు రావడంతో హుటాహుటిన పయనం అయ్యారు.

దాంతో ఏదో అద్భుతం జరగబోతోంది అని దేశమంతా అనుకుంది. ప్రత్యేకించి తెలుగు వారు అయితే ఇంకేముంది వెంకయ్యనాయుడే తదుపరి రాష్ట్రపతి అని కూడా భావించారు. దానికి తగినట్లుగానే వెంకయ్యనాయుడుతో అమిత్ షా రాజ్ నాధ్ సింగులు సమావేశం కావడంతో ఉత్కంఠ ఇంకా పెరిగింది.

ఒక విధంగా చూస్తే నలభై అయిదేళ్ల తరువాత తెలుగు వారికి ఆ ఉన్నత ఆసనం దక్కబోతోంది అని కూడా లెక్కలేశారు. 1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. ఆయన తరువాత మళ్లీ వెంకయ్యనాయుడుకే ఆ చాన్స్ అని కూడా అనుకున్నారు. అయితే చిట్ట చివరికి లేట్ నైట్ న్యూస్ లో కాషాయ పార్టీ పెద్దలు తేల్చేశారు.

కొత్త రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుకు అవకాశం దక్కలేదు అంటే ఆయన సంగతి ఎలా ఉన్నా తెలుగు వారు మాత్రం చాలా బాధపడిన సందర్భంగా ఇది ఉంది. ఉప రాష్ట్రపతిగానే వెంకయ్యనాయుడు తన పదవిని ముగించాల్సి రావడం ఇక అనివార్యమైంది. మొత్తానికి తెలుగు వారికి తృటిలో చాన్స్ తప్పిపోయింది అనుకోవాలేమో.