Begin typing your search above and press return to search.

అనుకున్న‌దే జ‌రిగింది.. ధ‌న్‌ఖ‌డ్ దే విజ‌యం

By:  Tupaki Desk   |   6 Aug 2022 5:52 PM GMT
అనుకున్న‌దే జ‌రిగింది.. ధ‌న్‌ఖ‌డ్ దే విజ‌యం
X
రాజ‌కీయ వ‌ర్గాలు.. విశ్లేష‌కులు ముందు నుంచి అనుకున్న‌దే జ‌రిగింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ్యూహ‌మే విజ‌యం ద‌క్కించుకుంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా..విప‌క్ష కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లోనూ ఘోరంగా విఫ‌ల‌మైంది. అంతేకాదు.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి మ‌రింత ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఆమె వ‌ద్ద‌న్నా.. వారించినా.. క‌న్నెర్ర చేస్తుంద‌ని తెలిసినా.. టీఎంసీ ఎంపీలు.. బీజేపీ అభ్య‌ర్థికి ఓటే య‌డం.. ఈ ఎన్నిక‌ల్లో చిత్రాతి చిత్రంగా మారింది.

భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్‌ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగ్దీప్ ధన్‌ఖడ్.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై విజయం సాధించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంట్‌ భవనంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ నిర్వహించారు. మెుత్తం 780 మంది ఎంపీలకు గానూ 725 మంది సభ్యులు ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. 93 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వివిధ పార్టీల ఎంపీలు ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్ లో వచ్చి ఓటు వేశారు.

మ‌మ‌త‌కు ఎదురు దెబ్బ‌!

లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల బలం ఉన్న బెంగాల్ సీఎం మ‌మ‌త నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉంది. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఆ పార్టీ ఎంపీలు శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి పోలింగ్‌లో పాల్గొన్నారు. మిగతా 34 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆరోగ్య కారణాల వల్ల భాజపా ఎంపీలు సన్నీ దియోల్, సంజయ్ ధోత్రే ఓటు వేయలేదు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆరుగంటలకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ చేపట్టగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం సాధించారు. ఈనెల 11న భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఎక్క‌డి నుంచి ఎక్క‌డి వ‌ర‌కు..?

భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన‌ జగదీప్‌ ధన్‌ఖడ్ రాజస్థాన్‌ ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన వ్య‌క్తి. మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాజిక, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే అత్యున్నత స్థాయికి ఎదిగారు.