Begin typing your search above and press return to search.

న్యాయం చేస్తారా .. మావోయిస్టుల్లో క‌లిసిపోమంటారా .. రాష్ట్ర‌ప‌తికి శిరోముండ‌నం బాధితుడి లేఖ

By:  Tupaki Desk   |   10 Aug 2020 2:30 PM GMT
న్యాయం చేస్తారా .. మావోయిస్టుల్లో క‌లిసిపోమంటారా .. రాష్ట్ర‌ప‌తికి శిరోముండ‌నం బాధితుడి లేఖ
X
తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసిన ఘటన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జిల్లా లోని రాజమండ్రి రూరల్ సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామంలో ఇసుక రేవుల నుండి ఇసుకను తీసుకెళ్తున్న లారీలను అత్యంత వేగంగా నడుపుతున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామానికి చెందిన దళిత యువకులు కొందరు లారీలను అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సంఘటన స్థలానికి వచ్చి కారుతో యువకులను ఢీ కొట్టేందుకు ప్రయత్నించగా కారు అద్దాలు పగిలిపోయాయి.

లారీలను అడ్డుకున్న ఆ యువకులే దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి అక్కడున్న దళిత యువకుడు వరప్రసాద్‌ ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీస్ స్టేష‌న్‌ కు తీసుకెళ్లిన పోలీసులు వరప్రసాద్ ను తీవ్రంగా కొట్టి శిరోముండ‌నం కూడా చేసారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సీఎం జగన్ కూడా ఈ ఘటన పై స్పందించి .. తక్షణమే కారణమైన వారిని తగిన విదంగా శిక్షించాలని అధికారులకి ఆదేశాలు జారీచేశారు. అయితే , తాజాగా ఈ కేసులో బాధితుడు ప్ర‌సాద్ త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేదంటూ రాష్ట్రప‌తికి లేఖ రాశాడు. శిరోముండ‌నం కేసులో నిందితులంద‌ర్నీ అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేసాడు. ఆలా చేయాలని ప‌క్షంలో మావోయిస్టుల్లో క‌లిసిపోవ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరాడు. దీనితో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.