Begin typing your search above and press return to search.

మంత్రి కేటీఆర్ వస్తుంటే చాలు.. ప్రతిసారీ అరెస్టు చేస్తుంటారట

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:49 AM GMT
మంత్రి కేటీఆర్ వస్తుంటే చాలు.. ప్రతిసారీ అరెస్టు చేస్తుంటారట
X
ఇటీవల కాలం లో పలు విషయాల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పంగా మారటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తేలా ఉంటున్నాయి. తాజాగా దీనికిసంబంధించి మరోకొత్త విషయం బయటకు వచ్చింది. మంత్రి కేటీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని పర్యటిస్తుంటే చాలు.. నేరళ్ల బాధితుల కుటుంబాల్ని అరెస్టు చేయటం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతి సారీ పోలీసులు తమను అరెస్టుచేయటాన్ని నేరళ్ల బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రం మీద పోరు చేస్తున్న అధికార టీఆర్ఎస్.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించటం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు వచ్చారు. ఆయన రాకకు కాస్త ముందుగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాధితుల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. దీని పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల్ని ఆయా కుటుంబాల వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ వచ్చిన ప్రతిసారీ తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ పోలీసుల్ని నిలదీశారు. అయితే.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పని పోలీసులు.. మూడు కుటుంబాలకు చెందిన వారిని బలవంతంగా వ్యాన్లో కి ఎక్కించారు. ఈ క్రమంలో కోల హరీశ్ నానమ్మ నాగవ్వ వ్యాన్ నుంచి కిందకు పడిపోయారు.

పోలీసుల తీరు పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భం గా ఈ లొల్లి ఏమిటని వాపోతున్నారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే.. ఈ ఇష్యూ ను మంత్రి కేటీఆర్ డీల్ చేసి.. సమస్య ను పరిష్కరిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. మంత్రి కేటీఆర్ కు తన నియోజకవర్గం లో జరిగే ఈ వ్యవహారంగురించి తెలుసా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.